‘‘సర్వ గుణాల సారం ఆమెలో గూడుకట్టుకుని ఉంది. ముప్పై ఏళ్ళు నిండని ముగ్ధరాలు, విశుద్ధశీల సంపన్న. ఆమె చూపిన సంఘటనా కౌశల్యం సాటిలేనిది. యుద్ధకళలో ఆమె ప్రావీణ్యం అపారం. ఇన్ని సుగుణాలున్న సద్గుణ సంపన్న భారతదేశంలో జన్మించడం పరమ సౌభాగ్యం’’—- వీరసావర్కర్
వేదభూమిగా పరిఢవిల్లుతోన్న భారతావనిలో ఎందరో మహామహులు జన్మించారు. ఆధ్యాత్మికవేత్తలు, శాస్త్రవేత్తలు, వీరులకు భారతావనిలో కొదవలేదు. ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖలు పుట్టిన ఈ గడ్డపై శత్రువులును గడగడలాడించి ముప్పతిప్పలు పెట్టిన వీరవనితలు ఎందరో. పరాయి పాలకుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన వీర మహిళల్లో ఝాన్సిరాణి ఓ కలికి తురాయి. కంప్యూటర్ యుగంలోనూ మహిళల ధైర్య సాహసాలను కీర్తించేందుకు ఝాన్సీ రాణీతోనే పోలుస్తున్నారంటే ఆమె ప్రతిభ, ధైర్యం, సాహసం ఎంతటివో అంచనా వేయవచ్చు. ఆమె స్మరణే మహిళా లోకానికి ఓ స్ఫూర్తి నినాదం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హిందూ సైన్యంలోనే ఝాన్సీరాణి పేరిట ఓ రెజిమెంట్ ను ఏర్పాటు చేయగా భారత సైన్యంలో ఆ విభాగం పేరిట ఇప్పటికీ సేవలందిస్తుండటం మరో విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కట్టడాలకు ఝాన్సీ లక్ష్మీ బాయి పేరును పెట్టి ఆమె అసమాన పోరాటపటిమన గౌరవిస్తూనే ఉన్నాం. 1857లో వలసపాలకులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, ప్రతిఘటనలో సింహాభాగం మరాఠీ యోధురాలు మణికర్ణికదే. నేడు ఝాన్సీ లక్ష్మీ బాయి వర్ధంతి.
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. 1828 నవంబరు 19న మహారాష్ట్రకు చెందిన కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో జన్మించింది. వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించిన మణికర్ణిక ఆ తర్మాత ఝాన్సీ రాజ్యానికి రాణిగా పగ్గాలు చేపట్టింది. మణికర్ణిక తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.
1842 లో ఝాన్సీ రాజు గంగాధర్ తో మణికర్ణికకు వివాహం జరిగింది. వారి సంప్రదాయం ప్రకారం లక్ష్మీబాయిగా ఆమె పేరు మార్చారు. గృహిణిగా జీవితాన్ని కొనసాగిస్తుండగా ఊహించనికష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వారసుడు లేకుండానే కొద్దీ కాలానికే రాజు గంగాధర్ మరణించాడు. మహారాజు చివరి కోరిక మేరకు దామోదర్ అనే బాలుడిని దత్తత తీసుకుంది. దత్తత స్వీకారం చెల్లదని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించేందుకు ఆంగ్లేయులు కుయుక్తులు పన్నారు. దీంతో ఝాన్సీ రాజ్య రక్షణ కోసం ఆంగ్లేయులతో మణికర్ణిక అలియాస్ ఝాన్సీ లక్ష్మీబాయి కఠోరంగా శ్రమించింది. ప్రజలకు కన్నతల్లిలా పాలన అందించింది.
కానీ ఆంగ్లేయుల కుయుక్తులను ఎదిరించడానికి ఆమె కదనరంగలోకి దూకు తప్పలేదు. గోవధ నిషేధించిన తన రాజ్యంలో నివాసాల మధ్యనే ఆవులను వధించడం, ఇలవేల్పు మహాలక్ష్మీ ఆలయ భూముల ఆక్రమించిన బ్రిటీషర్లు, స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో 1857న మే 31న ఆంగ్లేయులపై రాణీ లక్ష్మీబాయి యుద్ధభేరీ మోగించింది. ఏడాదిన్నర పాటు ఆమె తెల్లదొరలను నానా తిప్పలు పెట్టింది. మహాకాళిలా శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది.
నడుముకు తన దత్తపుత్రుడు ఆనందరావుని కట్టుకుని యుద్ధరంగంలోకి దూకింది. శత్రువుల నుంచి తప్పించుకుని గ్వాలియర్ చేరుకుని స్వతంత్ర పోరాటం లో తన సహచరులైన నానాసాహెబ్ పీష్వా తదితరులను కలుసుకుంది. అక్కడి నుంచి బాబా గంగదాస్ ఆశ్రమం చేరుకుంది. బ్రిటిష్ వాళ్లకు తన శవం కూడా చిక్కకూడదని స్వామీ జీ తో చెప్పి చితి పేర్పించుకుని స్వాతంత్ర సమారాగ్ని జ్వాలలకు ఆహుతైంది. వలసపాలకుల దాడిలో తీవ్రంగా గాయపడి 1858జూన్ 18న వీరమరణం చెందింది. ఆమె భౌతికంగా మన మధ్య లేనప్పటికీ నేటికీ సమాజాన్ని చైతన్య పరుస్తూనే ఉంది.