(నేడు ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ కెఎస్ సుదర్శన్‌జీ 93వ జయంతి)
సుదర్శన్‌జీకి స్వదేశీ జాగరణ్ మంచ్‌తో ప్రత్యక్షంగా సంబంధముంది. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి ఐదో సర్‌సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించడం కంటె ముందే స్వదేశీ జాగరణ్ మంచ్‌కు ఏడేళ్ళు మార్గదర్శకులుగా ఉన్నారు. దత్తోపంత్ ఠేంగడీ 1991లో స్వదేశీ జాగరణ్ మంచ్‌ను ప్రారంభించారు. 1993లో ఢిల్లీలో జాతీయ సదస్సు తర్వాత స్వదేశీ ఉద్యమం పుంజుకుంది. సంఘ కార్యకర్తల మద్దతుతో రెండు జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. గ్లోబలైజేషన్, బహుళజాతి కంపెనీల ముప్పుకు వ్యతిరేకంగా బలీయమైన శక్తిగా స్వదేశీ జాగరణ్ మంచ్‌ను నిలిచింది. ఆ సమయంలోనే సుదర్శన్‌జీ ఎస్‌జెఎంకు మార్గదర్శకులుగా చేరారు. తన బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన ఏనాడూ మంచ్ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరవకుండా లేరు. హుందాగా, ఉదాత్తంగా ఉండే ఆయన ఉనికి మంచ్ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అప్పటికింకా మంచ్ తొలినాళ్ళే. సుదర్శన్‌జీ సమర్ధ మార్గదర్శకత్వంలో ఆయన నిరంతర ప్రోత్సాహంతో మంచ్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రచారాలూ అన్నీ గొప్ప విజయాలు సాధించాయి.
దత్తోపంత్ ఠేంగడీజీ ఒకవైపు, సుదర్శన్‌జీ మరోవైపు ఉండి మంచ్‌ను ముందుకు నడిపారు. విదేశీ ట్రాలర్లతో సముద్రగర్భంలో చేపల వేటను వ్యతిరేకిస్తూ దేశంలోని కోస్తాతీర ప్రాంతాలు అన్నింటినీ కలుపుతూ ‘మత్స్యయాత్ర’ పేరిట స్వదేశీ జాగరణ్ మంచ్ చేపట్టిన యాత్ర గొప్ప విజయం సాధించింది. అలాగే ఉప్పు అయొడైజేషన్‌ను తప్పనిసరి చేస్తూ సాధారణ ఉప్పును నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ‘నమక్ ఆందోళన్’ ప్రచారమూ గొప్ప ప్రజాదరణ దక్కించుకుంది. అటువంగటి మరెన్నో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లో స్వదేశీ చైతన్యాన్ని రగల్చడంలో సుదర్శన్‌జీ గొప్ప చొరవ చూపించారు.
స్వదేశీ జాగరణ్ మంచ్ సమావేశాల్లో సుదర్శన్‌జీ ఉనికే విలక్షణంగా, అసాధారణంగా ఉండేది. ఆయన చురుకైన దృష్టి, పదునైన దార్శనికతతో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కఠినమైన నిర్ణయాలను తీసుకునేవారు. అప్పటి ప్రభుత్వం దేశప్రజలకు, దేశానికీ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ విదేశీ కంపెనీల గుప్పెట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. దేశీయ చట్టాలను సైతం విదేశీ శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా సవరిస్తుండేవారు. అలాంటి సమయంలో దత్తోపంత్ ఠేంగడీ, సుదర్శన్‌జీ సంయుక్త నేతృత్వంలో స్వదేశీ జాగరణ్ మంచ్ అప్పటి ప్రభుత్వాలతోనూ, విదేశీ శక్తులతోనూ పోరాడింది.
సుదర్శన్‌జీ సరళమైన జీవితం, సమర్ధమైన దిశానిర్దేశం స్వదేశీ కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకునేవి. ఆయన మేధోశక్తి, అపేక్షతో కూడిన దిశానిర్దేశం స్వదేశీ జాగరణ్ మంచ్‌ను సరైన దిశలో నడిపి, విజయాలను సాధించేలా చేసింది. ఆయన సరళ స్వభావం వల్ల చర్చలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగేవి. ఒకసారి స్వదేశీ జాగరణ్ మంచ్ ‘అభివృద్ధికి స్వదేశీ నమూనా’ అన్న అంశంపై ఒక పత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. ఆ పత్రం రూపకల్పనలో కెవిఐసి మాజీ చైర్మన్ డా. మహేష్ శర్మ, పలువురు కార్యకర్తలు పాలుపంచుకున్నారు. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత తుది ముసాయిదా తయారైంది. దాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కార్యవర్గం ముందు ఉంచారు. ఆ అంశం సుదర్శన్‌జీకి ఎంతో అభిమానపాత్రమైన విషయం. ఆయన ఆ అంశం గురించి తన ప్రసంగాల్లో ఎల్లప్పుడూ ఏదో ఒకరూపంలో ప్రస్తావించేవారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలు, భారతదేశంపై వాటి ప్రభావాల గురించి సుదర్శన్‌జీ విస్తృతంగా చేసిన వ్యాఖ్యానాలు, ఆయన మార్గదర్శకత్వం ఆ పత్రాన్ని సర్వసమగ్రం చేసింది. కాలక్రమంలో ఆ పత్రమే దేశాభివృద్ధి గురించిన చర్చల్లో ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది.
కాలక్రమంలో సుదర్శన్‌జీ ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన కార్యక్షేత్రం నాగపూర్‌కు మారింది. అయినా స్వదేశీ విషయాల పట్ల ఆయన మక్కువ ఎంతమాత్రం తగ్గలేదు. వందనాశివ వంటి ప్రముఖ నిపుణులు, పర్యావరణవేత్తలతో తరచూ చర్చలు జరుపుతుండేవారు. వారి కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరయ్యేవారు, అవకాశం లేనప్పుడు స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులను పంపిస్తుండేవారు.
సుదర్శన్‌జీకి పలు భారతీయ భాషల్లో ప్రవేశం ఉంది. అయినా ఆయనకు హిందీ అంటే సహజమైన అభిమానం ఉండేది. భారతీయ ప్రజలకు ఆంగ్లం ఎందుకు తగదు అన్న విషయం మీద ఆయన తరచుగా వివరిస్తుండేవారు. ఎవ్వరైనా సరే తమ మాతృభాషలోనే తమ భావాలను సరిగ్గా వ్యక్తీకరించగలుగుతారు అన్న విషయాన్ని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ఆంగ్ల భాష, దాని వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఆయన హాస్యభరితంగా మాట్లాడేవారు. భారతీయ భాషల వార్తాపత్రికల్లో ఇంగ్లీషు పదాల వినియోగం పెరిగిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసేవారు. దేశీయమైన భాషలు, దేశీయమైన భావాలే దేశాన్ని ముందుకు నడిపించగలుగుతాయని గ్రహించి, దాన్ని ఆచరణలో పెట్టిన మహనీయుడు సుదర్శన్‌జీ.