ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ, రేపు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీలోని వారణాసిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో పిఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తారు. సుమారు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20వేల కోట్లకు పైగా నిధులు జమ చేస్తారు. అదే కార్యక్రమంలో స్వయంసహాయక సంఘాలకు చెందిన 30వేల మందికి పైగా మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకూ 11 కోట్లకు పైగా అర్హులైన రైతుల కుటుంబాలకు రూ. 3.04 లక్షల కోట్ల కంటె ఎక్కువ నిధులు సమకూర్చారు. కృషి సఖి కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కింద గ్రామీణ మహిళలకు పారా-ఎక్స్టెన్షన్ వర్కర్లుగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమం కింద గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించాలన్న లక్ష్యసాధనలో ఈ శిక్షణా కార్యక్రమం తోడ్పడుతుంది.
ప్రధాని మోదీ ఈ రాత్రి 7గంటలకు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో గంగాహారతికి హాజరవుతారు. రాత్రి 8గంటల సమయంలో కాశీ విశ్వనాధుణ్ణి దర్శించుకుంటారు.
అంతకుముందు, ఈ ఉదయం సుమారు 9.45 గంటలకు మోదీ బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ శిథిలాలను సందర్శిస్తారు. నలంద శిథిలాలను 2016లో ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక స్థలంగా ప్రకటించారు. ఉదయం 10.30కు రాజ్‌గిర్ వద్ద నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ఆవిష్కరిస్తారు. భారత్-తూర్పుఆసియా సదస్సు దేశాలు సంయుక్తంగా ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాయి.