ఇటీవల 12వ తరగతి రాజనీతిశాస్త్రం (పొలిటికల్ సైన్స్) పాఠ్యపుస్తకంలో ఎన్‌సిఇఆర్‌టి కొన్ని మార్పులు చేసి కొత్త పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసింది. అందులో అయోధ్యకు సంబంధించిన పాఠంలో గణనీయమైన మార్పులు చేసారు. ఈ యేప్రిల్ నెలలో చేసిన మార్పులు, విద్యార్ధులకు అయోధ్య గురించి అసలైన వాస్తవాలను తెలియజేసేలా ఉన్నాయి. చారిత్రకంగా సున్నితమైన, వివాదాస్పదమైన అయోధ్య అంశంలో చేసిన మార్పులు పాఠ్యపుస్తకాల్లో చారిత్రక ఘటనలను చిత్రీకరించే తీరు గురించి చర్చనీయాంశమయ్యాయి.
పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో 8వ అధ్యాయం ‘అయోధ్య’కు సంబంధించినది. టెక్స్ట్‌బుక్ తాజా ఎడిషన్ ఆ అధ్యాయంలో పలు మార్పులు చేసింది.
పాత పాఠ్యపుస్తకం ఆ ప్రదేశాన్ని బాబ్రీ మసీదుగా పలుచోట్ల సంబోధించింది. మొగల్ చక్రవర్తి బాబర్ సైన్యాధిపతి మీర్ బాకీ 16వ శతాబ్దంలో నిర్మించిన మసీదుగా వివరించింది. అయితే ప్రస్తుత పాఠ్యపుస్తకం ఆ ప్రత్యక్ష సంబోధనను పరిహరించింది. దాన్ని ‘మూడు గుమ్మటాలు కలిగిన నిర్మాణం’గా పేర్కొంది. ‘‘శ్రీరాముడి జన్మస్థానంలో 1528లో మూడు గుమ్మటాల ఆకృతిని నిర్మించారు.కానీ ఆ నిర్మాణం లోపలా బయటా హిందూ చిహ్నాలు, హిందూ దేవాలయ అవశేషాలూ స్పష్టంగా కనిపించేవి’’ అని వివరించింది.
పాత పాఠ్యపుస్తకం 1986 ఫిబ్రవరిలో మసీదు తాళాలు తెరిచిన తర్వాత రెండువైపులా సమీకరణ జరిగిన తీరును సవిస్తరంగా వివరించింది. అందులో రథయాత్ర, కరసేవ, నిర్మాణం పడగొట్టడం, ఆ తర్వాత చెలరేగిన మతహింస గురించి ప్రస్తావనలు ఉండేవి. ఇప్పుడు సవరించిన పాఠ్యపుస్తకంలో ఆ భాగాన్ని కుదించారు. ‘‘ఆ తరువాత రెండు మతాల మధ్యా యాజమాన్య హక్కుల గురించి ఉద్రిక్తతలు పెరిగాయి. వాటివల్ల ఎన్నో గొడవలు, న్యాయవివాదాలూ తలెత్తాయి’’ అని సంక్షిప్తంగా వివరించారు.
పాత పుస్తకం ‘అయోధ్యలో పరిణామాలపై బిజెపి పశ్చాత్తాపం వ్యక్తం చేయడాన్ని’ వర్ణించింది. నిర్మాణం పడగొట్టిన తర్వాత ‘లౌకికవాదంపై తీవ్రమైన వాదోపవాదాల’ను సుదీర్ఘంగా వివరించింది. కొత్త పాఠ్యపుస్తకం ఆ విషయంలో మరింత సమతూకంగా ప్రవర్తించింది. ‘‘సుదీర్ఘకాలం నుంచి ఉన్న అంశానికి న్యాయమైన పరిష్కారం కావాలని రెండు మతాలూ కోరుకున్నాయి. 1992లో, నిర్మాణం విధ్వంసం తర్వాత, అది భారత ప్రజాస్వామ్య సూత్రాలకు బలమైన సవాల్‌గా నిలిచిందంటూ కొందరు విమర్శకులు వాదించారు’’ అని వివరించింది.
సవరించిన పాఠ్యపుస్తకం పాత పుస్తకంలోని కొన్ని అంశాలను తొలగించింది. వాటిలో 1992 డిసెంబర్ 7 నాటి వార్తాపత్రికల క్లిప్పింగ్‌లు కొన్ని ఉన్నాయి. ‘‘బాబ్రీ మసీదు విధ్వంసమైంది, కేంద్రం కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’’ అనే హెడ్లైన్లను తొలగించింది. దానికి బదులుగా 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు గురించి, చట్ట ప్రక్రియ గురించి వివరించింది. ఇప్పుడు ‘‘మసీదు నిర్మాణం ప్రారంభించడానికి ముందు, తర్వాత కూడా హిందువుల నమ్మకం, విశ్వాసం ఏంటంటే రాముడు జన్మించిన ప్రదేశంలోనే బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది’’ అన్న సుప్రీంకోర్టు తీర్పులోని వాక్యాన్ని ఆ పాఠంలో చేర్చింది.
పాత పాఠ్యపుస్తకం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య, న్యాయమూర్తి జిఎన్ రే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ను దోషిగా తేల్చడాన్ని ప్రస్తావించింది. కొత్త పాఠ్యపుస్తకం 2019 సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించింది. ఈ మార్పు ఆధునిక న్యాయ దృక్కోణాన్ని ప్రతిఫలిస్తోంది. పాత తీర్పుల దగ్గర ఆగిపోకుండా కొత్త, తుది తీర్పును చేర్చింది.
అయోధ్య అధ్యాయంలో చేసిన మార్పులు ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో స్థూలంగా చేసిన సవరణల్లో భాగం. అవి రాజకీయ, విద్యా ప్రాధమ్యాల్లో మార్పును ప్రతిఫలిస్తున్నాయి. పొలిటికల్ సైన్స్ కొత్త టెక్స్ట్‌బుక్‌లో అయోధ్య అధ్యాయాన్ని నాలుగు పేజీల నుంచి రెండు పేజీలకు కుదించారు. మత హింస, రాజకీయ పరిణామాలు, కొన్ని జన సమీకరణ ఘటనల గురించి విస్తారమైన వివరణలను తొలగించారు. తద్వారా చారిత్రక సంఘటనలను సూటిగా సంక్షిప్తంగా చెప్పడానికి అవకాశం కలిగింది.
అయోధ్య వివాదం భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో ఒకటి. 1992లో బాబ్రీ నిర్మాణం విధ్వంసం, తదనంతర మతహింస తీవ్ర వివాదాలకు కారణమయ్యాయి. ఆ సంఘటనలకు పాత పాఠ్యపుస్తకాలు పెద్దపీట వేసాయి. రాజకీయ పార్టీల పాత్ర, మతపరమైన జన సమీకరణ, న్యాయ పోరాటాల గురించీ వివరంగా చెప్పేవి. సవరించిన పాఠ్యపుస్తకాల్లో వాటిని కుదించారు.
ఈ విధమైన మార్పు ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి, చరిత్రను దర్శించడంలో మరింత సమతూకమైన పద్ధతిని అనుసరించడానికీ ప్రయత్నం జరిగిందని కొంతమంది విద్యావేత్తలు, చరిత్రకారులు భావిస్తున్నారు. విమర్శకులు మాత్రం చరిత్రను అతిగా కుదించడం ద్వారా చారిత్రక ఘటనలలోని సంక్లిష్టతలను వక్రీకరిస్తున్నారని వాదిస్తున్నారు.
యువ మస్తిష్కాలను తీర్చిదిద్దడంలో పాఠ్యాంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. చారిత్రక ఘటనలను పాఠాలలో వివరించే తీరుతెన్నులు, విద్యార్ధులు తమ దేశపు గతం గురించి, సామాజిక-రాజకీయ ముఖచిత్రం గురించీ అర్ధం చేసుకునే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో తాజా సవరణలు పాఠ్యాంశాలను జాగ్రత్తగా తీర్చిదిద్దడం ద్వారా వాటిని కచ్చితంగా ఉంచుతూనే సమాజంలోని వైవిధ్యభరితమైన దృక్కోణాల పట్ల సున్నితంగా వ్యవహరించడం సాధ్యమయింది.
అంతేకాదు, ఈ సవరణల ద్వారా ప్రభుత్వం, విద్యాధికారులూ పాఠ్యపుస్తకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, తద్వారా పాఠ్యాంశాలు వర్తమాన విషయాలనూ, సామాజిక మార్పులనూ ప్రతిఫలిస్తూ ప్రాసంగికంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు.
పాఠ్యపుస్తకాలను ఏడాదికోసారి సమీక్షించే విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఎన్‌సిఇఆర్‌టికి సూచించింది. కొత్తకొత్త పరిణామాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం, సామాజికంగానూ సాంకేతికంగానూ వస్తున్న కొత్త మార్పులు, పురోగతులను పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడమే ఆ సూచన లక్ష్యం.
ఇటువంటి సానుకూల ధోరణి, విద్యలో ప్రతిభావ్యుత్పత్తులను ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించే విషయంలో ప్రభుత్వం నిబద్ధతను ప్రతిఫలిస్తోంది. పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల విద్యార్ధులకు నవీకరించిన, సమగ్రమైన విద్యావనరులను సమకూర్చడం సాధ్యమవుతుంది.
వార్షిక సమీక్ష పద్ధతి వల్ల పాఠ్యాంశాల్లో పక్షపాత ధోరణులను, తప్పులను వెంటనే సవరించుకోడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల పాఠ్యాంశాలు వైవిధ్యభరితమైన దృక్కోణాలను నిజాయితీగా ప్రతిఫలించగలుగుతాయి.
పాఠ్యపుస్తకాల సవరణ పద్ధతి 2020 జాతీయ విద్యావిధానానికీ (ఎన్ఇపి), నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్కీ (ఎన్‌సిఎఫ్) అనుగుణంగా ఉంది. ఈ ఫ్రేమ్‌వర్క్ విద్యావిధానంలో ఆచరణాత్మక సమీకృత ధోరణికి, సునిశిత ఆలోచనకు, సృజనాత్మకతకు వీలు కల్పిస్తోంది. భారతదేశపు వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని అర్ధం చేసుకోడానికి ప్రాధాన్యమిస్తోంది.
ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలను కొత్త కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌తో జోడించేలా అప్డేట్ చేయడం, తాజా పరిణామాలను ఎప్పటికప్పడు జోడించడానికి కనీసం రెండేళ్ళు పడుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందాయి. ఇప్పుడు తాజాగా తయారైన 12వ తరగతి రాజనీతి శాస్త్రం పాఠ్యపుస్తకం, సున్నితమైన చారిత్రక అంశం విషయాన్ని దానిలోని ప్రధానమైన పరిణామాలు అన్నింటినీ కూడగట్టుకుంటూ సమతూకంగా చెప్పే విషయంలో గొప్ప పరిణతిని చూపింది.