దేశంలో కొత్త నేర చట్టాల అమలుకు కేంద్రం సిద్దమైంది. జులై 1వ తేదీ నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టాలను జులై 1 నుంచి అమలు చేయనున్నారు. ఐపీసీ, ఐఈఏ, సీఆర్‌పీసీల స్థానంలో కొత్త చట్టాలను పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేశారు. ఇప్పటికే వీటిపై శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. నేర న్యాయవ్యవస్థలో ఈ మూడు చట్టాలు చాలా కీలకమని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు. ఈ మూడు చట్టాలను గత ఏడాది పార్లమెంట్ ఆమోదించగా 2023 డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.