(నేడు ఆర్ఎస్ఎస్ మూడవ సర్సంఘచాలక్ వర్ధంతి)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర్సంఘచాలక్గా వ్యవహరించిన పరమపూజ్య బాలాసాహెబ్ దేవరస్ వర్ధంతి ఇవాళ. దశాబ్దాల పాటు దేశానికి, దేశ ప్రజలకూ సేవ చేయడం కోసం అంకితమైపోయిన మహనీయమూర్తి. ఆయన జీవితం నాయకత్వానికి, సహనానికి, సమాజ సంక్షేమానికీ తిరుగులేని నిబద్ధతకు మారుపేరు దేవరస్‌జీ.
బాలాసాహెబ్ దేవరస్ 1916 మార్చి 18న మహారాష్ట్ర నాగపూర్‌లో జన్మించారు. సంప్రదాయిక భారతీయ విలువలు మూలాలుగా కలిగిన కుటుంబం వారిది. ఆయనకు బాల్యం నుంచీ సామాజిక అంశాలపై ఆసక్తి, ప్రజాసేవపై నిబద్ధత ఎక్కువ. ఆ విలువల పునాదులే అనంతరకాలంలో ఆర్ఎస్ఎస్ నేతగా ఆయనకు బలం చేకూర్చాయి.
యౌవనంలోనే ఆర్ఎస్ఎస్లో చేరిన బాలాసాహెబ్, సంస్థలో వేగంగా ఎదిగారు. సంస్థాగత దూరదృష్టిని, ఆనాటి సామాజిక పరిస్థితులనూ అర్ధం చేసుకోవడంలో దిట్ట ఆయన. 1973లో బాలాసాహెబ్ సర్సంఘచాలక్ అవడం ఆర్ఎస్ఎస్లోనూ, భారతీయ సమాజంలోనూ కీలక పరిణామం.
బాలాసాహెబ్ దేవరస్ సర్సంఘచాలక్గా పనిచేసిన కాలంలో సంఘాన్ని భారతీయ సమాజంతో మరింత గాఢంగా జతపరిచేందుకు అవిరళ కృషిచేసారు. ఆనాటి సమాజంలోని రుగ్మతలను, ప్రత్యేకించి అంటరానితనాన్ని దూరం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేసారు. అస్పృశ్యతను ఆయన మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూండేవారు. దేవరస్ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ అంటరానితనానికి వ్యతిరేకంగా, సామాజిక సమరసతను ప్రచారం చేసింది.
అంటరానితనాన్ని నిర్మూలించడానికి, వివిధ కులాల మధ్య ఐకమత్యాన్ని పెంచడానికీ దేవరస్ తీసుకున్న చర్యలు ఆయనకు ఎంతో అభిమానాన్నీ, గౌరవాన్నీ సంపాదించిపెట్టాయి. ఆయన కేవలం సైద్ధాంతిక బోధనలకే పరిమితం కాకుండా క్రియాశీలకంగా ఆచరణలో పెట్టారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌లు ఎవరూ అంటరానితనాన్ని పాటించకుండా ఆదర్శంగా నిలిచారు.
బాలాసాహెబ్ దేవరస్ నాయకత్వంలో కీలక ఘట్టంగా ఎమర్జెన్సీని ఎదుర్కొనడాన్ని చెప్పవచ్చు. 1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితి ప్రకటించింది. ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామిక విలువలకు, పౌరస్వాతంత్ర్యానికీ వాటిల్లే ముప్పును బాలాసాహెబ్ గుర్తించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంఘకార్యకర్తలతో ఉద్యమం నడిపారు.
తీవ్రమైన అణచివేతను, జైలుశిక్షనూ ఎదుర్కొన్నప్పటికీ బాలాసాహెబ్ దృఢనిశ్చయంలో ఎంతమాత్రం మాత్రం మార్పు లేదు. దేశంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామిక స్వేచ్ఛ పునరుద్ధరణ జరిగేవరకూ ఆందోళన ఆపేదే లేదని స్పష్టం చేసారు. అలాంటి కష్టకాలంలో ఆయన నాయకత్వంలో సంఘం ప్రజాస్వామిక విలువల పరిరక్షకురాలిగా ప్రజలందరికీ తెలిసివచ్చింది. దేశహితం కోసం నిబద్ధతతో పనిచేసే నైతికబలమున్న నాయకుడిగా బాలాసాహెబ్ దేవరస్‌ను ప్రజలు అభిమానించారు.
సైద్ధాంతిక ఆదర్శాలు, రాజకీయ రంగాలలోనే కాకుండా బాలాసాహెబ్ దేవరస్ కార్యకాలంలో సంఘ స్వయంసేవకులు మానవతాదృక్పథంతో పనిచేయడమూ ప్రజలను ఆకట్టుకొంది. ప్రకృతి వైపరీత్యాల వేళ సంఘ కార్యకర్తలను సేవాకార్యక్రమాలకు పురిగొల్పడంలో దేవరస్‌జీ మార్గదర్శకులుగా నిలిచారు. 1977లో కృష్ణాజిల్లా దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు స్వయంసేవక్‌లు అందించిన సేవ, బాలాసాహెబ్ నాయకత్వ పటిమకు నిదర్శనం. స్వయంగా తనే నేతృత్వం వహిస్తూ, దేశంలోని నలుమూలల నుంచీ వేలాది కార్యకర్తలను దివిసీమకు తరలించి అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఉప్పెనతో ఛిద్రమైపోయిన ప్రాంతాల్లో ఆయన పర్యటనలు బాధితులకు ఓదార్పుగా నిలిస్తే సంఘ కార్యకర్తల్లో సేవాభావాన్నీ, సహానుభూతినీ కలిగించాయి.
1993లో అనారోగ్య కారణాలతో బాలాసాహెబ్ దేవరస్ సర్సంఘచాలక్ బాధ్యతల నుంచి వైదొలగారు. సంఘ బాధ్యతను ముందుతరానికి అందించారు. అయినప్పటికీ దశాబ్దాల సేవ ద్వారా ఆర్జించిన జ్ఞానంతో ఆయన చివరి వరకూ సంఘానికి మార్గదర్శకత్వం చేస్తూనే ఉన్నారు.
వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, బైటినుంచి ఎదురయ్యే సవాళ్ళ మధ్య ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగల శక్తి బాలాసాహెబ్‌కు సంఘం నుంచే వచ్చింది. సంఘ బోధనలు, సంఘ విలువల పట్ల ఆయన అంకితభావం అచంచలమైనది. వినయంతోనూ, నిబద్ధతతోనూ కూడుకున్న ఆయన నాయకత్వం ఆర్ఎస్ఎస్లోనే కాక బైటి ప్రపంచంలో కూడా భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచింది.
బాలాసాహెబ్ దేవరస్ వారసత్వం నేటికీ జాతి నిర్మాణంలోనూ, సమాజ సంస్కరణలోనూ, మానవీయ సేవలోనూ సంఘ్ పాటుపడుతున్న నిరంతర కృషి రూపంలో కొనసాగుతోంది. ‘ప్రతీ పౌరుడూ సాధికారతనూ గౌరవాన్నీ కలిగి ఉండే సమృద్ధ సమైక్య భారతదేశం’ అన్న దేవరస్ దార్శనికత ఆర్ఎస్ఎస్కు మార్గదర్శన సూత్రంగా నిలిచిపోయింది.
బాలాసాహెబ్ దేవరస్ నాయకత్వం రాజకీయ సరిహద్దులకు అతీతంగా నిలిచింది, భారతదేశపు సామాజిక-సాంస్కృతిక చిత్రంపై చెరగని ముద్ర వేసింది. ఒక రాజనీతిజ్ఞుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన మనకు అందించిన వారసత్వం ఘనమైనది. చిత్తశుద్ధి, కరుణ, సేవాభావం పట్ల అచంచలమైన నిబద్ధతతో కూడిన నాయకత్వానికి నిలువెత్తు రూపం ఆయన. దేశపు మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేసే ప్రతీఒక్కరికీ బాలాసాహెబ్ దేవరస్ జీవితం స్ఫూర్తిగానూ, ఆశాకిరణంగానూ నిలుస్తుంది.