రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గురించి తప్పుదోవ పట్టించేలా ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వార్త ప్రచురించింది. బిజెపి నేత జె.పి నడ్డా కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా భాగవత్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో బహిరంగ ప్రకటన చేసారని ఆ పత్రిక ప్రచురించింది.
ఆ తప్పుడు కథనం ప్రకారం భాగవత్ ‘‘మన దేశంలోని ప్రతీ పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. నడ్డా ప్రకటనలో సంఘానికి ప్రమేయం ఎంతమాత్రం లేదు’’ అని చెప్పారట. పైగా భాగవత్ ప్రకటనను బిజెపి లేదా ఆర్ఎస్ఎస్ విధానాలతో సరిపోల్చకూడదని కూడా ఆ వార్తాకథనం పేర్కొంది.
సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, ఆ వార్త నిరాధారమైనదంటూ కొట్టిపడేసారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఎటువంటి బహిరంగ ప్రకటనా చేయలేదని అంబేకర్ ట్వీట్ చేసారు. భాగవత్ ప్రస్తుతం సంఘ్ దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాల్లో పాల్గొనడం కోసం దేశమంతా పర్యటిస్తున్నారు.
అసలు జెపి నడ్డా ఏమన్నారు? దానిగురించి ఏం ప్రచారం అవుతోంది? కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సంస్థకు ముఖాముఖీ ఇచ్చారు. అందులో నడ్డా బీజేపీ స్వీయ సామర్థ్యాల గురించి మాట్లాడారు. బిజెపి ఆర్ఎస్ఎస్పై ఆధారపడడం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. బిజెపి తన పనికి ఆర్ఎస్ఎస్ అవసరం తప్పనిసరి అని భావించే స్థితిని దాటేసిందని చెప్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంఘ శిక్షా వర్గలు జరుగుతున్నాయి. తూర్పు ప్రాంతంలో జరుగుతున్న అటువంటి ఒక శిక్షావర్గలో సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ శిక్షితులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఆలోచనా వేదిక అనీ, బిజెపి రాజకీయ కార్యకలాపాల కంటె అది భిన్నమైనదనీ ఆయన చెప్పారు. ఆ విషయంలో శిక్షితుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. తన వ్యాఖ్యలను అతిగా విశ్లేషించవలసిన అవసరం కూడా ఏమీ లేదని భాగవత్ స్పష్టం చేసారు.
మోహన్ భాగవత్ వివరణ ఆనాటి సభాసదులకు ఆర్ఎస్ఎస్ మౌలిక లక్ష్యాలు, నిరంతర కృషి ద్వారా ఆ లక్ష్యాలను సాధించడం, స్థితిగతుల గురించిన అవగాహనను ఎక్కువమందికి చేరవేయడం పైనే సంఘం దృష్టి కేంద్రీకృతమై ఉంటుందన్న అవగాహన కలగజేసింది.