పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఎక్స్‌ప్రెస్ రైలును ఒక గూడ్స్ బండి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఉదయం సుమారు 8.45 గంటలకు జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 10 నుంచి 15 మంది ప్రయాణికులు చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
డార్జిలింగ్ జిల్లా రంగాపానీ రైల్వేస్టేషన్ చేరువలో ఈ ప్రమాదం జరిగింది. కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సియాల్డా వెడుతోంది. న్యూ జలపాయ్‌గురికి దగ్గరగా ఉన్న రంగాపానీ స్టేషన్ చేరువలోకి ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చేసరికి వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ వెనుక రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సుమారు 15మంది ప్రయాణికులు చనిపోయి ఉండొచ్చని కటీహార్ డివిజనల్ రైల్వే మేనేజర్ అంచనా వేసారు.
విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. సహాయకచర్యలు ప్రారంభించారు. డిజాస్టర్ రెస్క్యూ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలవాల్సి ఉంది.
త్రిపుర రవాణా మంత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.