ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్యకు సుఫారీ ఇచ్చాడనే ఆరోపణలపై భారత సంతతి వ్యక్తి నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అమెరికాకు అప్పగించింది. కొన్ని నెలల కిందట చెక్ రిపబ్లిక్ వెళ్లిన గుప్తాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే నిఖిల్ గుప్తా, పన్నూ హత్య కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ గుప్తాను అదుపులోకి తీసుకుంది. న్యాయప్రక్రియ పూర్తైన తరవాత గుప్తాను ఆదివారం అమెరికాకు అప్పగించిందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. గుప్తాను న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
పన్నూ హత్య కుట్ర కేసులో తనను అన్యాయంగా ఇరికించారని అమెరికా ఒత్తిడి మేరకు చెక్ రిపబ్లిక్ న్యాయవాదులు కేసును తారుమారు చేశారని గుప్తా ఆరోపిస్తున్నారు. నిజ్జర్ హత్య తరవాత కెనడాతో భారత సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. పన్నూ హత్య కుట్రను భగ్నం చేశామని అమెరికా పోలీసులు ప్రకటించారు. అయితే పన్నూ హత్యకుట్రలో గుప్తాను చేర్చడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. త్వరలో అమెరికా రక్షణ సలహాదారు, భారత రక్షణ సలహాదారు దోవల్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో గుప్తాను అమెరికాకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.