విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోటాలో తాజాగా బిహార్‌కు చెందిన ఆయుష్ జైస్వాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ జేఈఈ కోచింగ్ కోసం బిహార్ నుంచి వచ్చి కోటాలోని ఓ కోచింగ్ కేంద్రంలో జైస్వాల్ చేరారు. గడచిన రెండు రోజులుగా అద్దెకు ఉంటోన్న గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపు తట్టి చూశాడు. అయినా తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూశారు. జైస్వాల్ ఉరివేసుకుని కనిపించాడు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
ఆయుష్ జైస్వాల్ మృత దేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తరవాత తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 11 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం హెల్ప్ లైన్ ప్రారంభించింది.