జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి ముందే జేకేలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రయాణీకులే లక్ష్యంగా ఓ బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కూడా ఉగ్రవాదులు తెగబడుతూనే ఉన్నారు. దీనిపై కేంద్రం సీరియస్గా ఉంది.
ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో ఉగ్రమూలాలను ఏరివేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఢిల్లీలో కీలక సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. లక్షలాది హిందూ భక్తులు పాల్గోనున్నారు. ఉగ్రవాదులు ఏ వైపు నుంచి అయినా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. సరిహద్దులను బలోపేతం చేయడం, ఉగ్రమూలాలను పెకలించే కార్యక్రమానికి కేంద్రం రూపకల్పన చేస్తోంది. బలగాలను కూడా పెద్ద ఎత్తున దించే కార్యక్రమం చేస్తున్నారు.
సరిహద్దుల్లో డ్రోన్లతో పహారాను పెంచనున్నారు.