రేణుకాస్వామి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. రేణుకా స్వామిని తన అనుచరులు బెంగళూరులోని ఓ షెడ్డుకు తీసుకువచ్చారని, తన భార్యకు అసభ్యకర ఫోటోలు, వీడియోలు పంపాడని, క్షమాపణలు చెప్పించాలని మాత్రమే చూశానని నటుడు దర్శన్ చెప్పుకొచ్చారు. రేణుకాస్వామిని రెండు దెబ్బలు కొట్టి, తరవాత కొంత డబ్బు ఇచ్చి భోజనం చేసి ఇంటికెళ్లాలని సూచించానని కన్నడ నటుడు దర్శన్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తరవాత ఏం జరిగిందో తనకు తెలియదన్నాడు.
వారం కిందట బెంగళూరు సమీపంలోని ఓ కాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహాన్ని ఫుడ్ డెలివరీ బాయ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటీజీ, ఫోన్ కాల్స్ ఆధారంగా 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో నటుడు దర్శన్, రేణుకా స్వామిని రెండు దెబ్బలు కొట్టినట్లు అంగీకరించాడు.
రేణుకా స్వామిని షెడ్డులో చిత్రహింసలకు గురిచేశారని విచారణలో వెల్లడైంది. కరెంట్ షాక్ పెట్టినట్లు అరెస్టైన నిందితులు వెల్లడించారు. అతను శాఖాహారి అని తెలిసికూడా మాంసం బలవంతంగా తినిపించారు. మాంసం తింటే బలం వస్తుంది. మరిన్ని దెబ్బలు తినవచ్చని వెటకారం ఆడినట్లు కూడా నిందితులు వెల్లడించారు. నిందితుల ఇళ్ల నుంచి డబ్బు, అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్శన్ భార్య, నటి పవిత్ర ఫోన్కు అసభ్య వీడియోలు, ఫోటోలు పంపడం హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.