టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా గెలిచింది. ట్రావిస్ హెడ్ (68), మార్కస్ స్టొయినిస్ (59) బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించారు. దీంతో స్కాట్లాండ్ పై ఆసీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు ఆసీస్ ముందు 181 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
స్కాట్లాండ్ జట్టులో బ్రెండన్ మెక్కలెన్ 34 బంతుల్లో 60 పరుగులు చేయగా జార్జ్ మున్సే (35) రాణించాడు. కెప్టెన్ రిచీ బెరిగ్టంన్ (42*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జట్టు 180/5 స్కోర్ చేసింది.
నమీబియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. వాన పడటంతో మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఆటను 10 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఐదు వికెట్లు నష్టపోయి 122 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో నమీబియా మూడు వికెట్లు నష్టపోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ గెలుపుతో గ్రూప్-బిలో ఇంగ్లాండ్ ఐదు పాయింట్లు సాధించింది. స్కాట్లాండ్‌కు సైతం అన్నే పాయింట్లు ఉండడంతో సూపర్8కు ఏ జట్టు చేరాలో నిర్ణయించడానికి ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ ఫలితం అనివార్యమైంది. కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఆ మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓడిపోవడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. నెట్‌రన్‌రేట్ ఆధారంగా తదుపరి దశకు చేరింది.