టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్ ఆడాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టు లీగ్ లో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని చూసినప్పటికీ రోహిత్ సేనకు అవకాశం దక్కలేదు. భారత్ ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లాడు. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ వేదికగా కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ వేయకుండానే రద్దు అయింది.
వారం రోజులుగా ఇక్కడ కురుస్తున్న వానలతో శ్రీలంక-నేపాల్, అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ లూ కూడా ఇదే తరహాలో రద్దు అయ్యాయి. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆటను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు.ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. దీంతో మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత్ ఏడు పాయింట్లతో గ్రూప్-ఏ నుంచి అగ్రస్థానం దక్కించుకుని సూపర్-8కి సిద్ధమైంది.
ఈనెల 20 నుంచి సూపర్ -8 మ్యాచ్‌లు మొదలవుతాయి. దీంతో 8 జట్లూ రెండు గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూపులో ఉన్న మిగిలిన మూడు జట్లతో తలపడనున్నాయి.
సూపర్ -8లో రోహిత్ సేన, జూన్ 20న అప్ఘనిస్తాన్ తో తలపడనుంది. అంటిగ్వా వేదిగా మొదటి మ్యాచ్ ఆడనుంది. 22న గ్రూప్ డీ లో రెండో స్థానంలో నిలిచే జట్టు (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్)తో తలపడాల్సి ఉంటుంది. 24న ఆస్ట్రేలియాతో తుదిపోరు ఉంటుంది.