దొంగలు తెలివిమీరిపోయారు. తాళాలు వేసి ఉండే ఇళ్లకు కన్నాలు వేసే వారి గురించి విన్నాం. కాని విమానాల్లో మాత్రమే తిరుగుతూ విమాన ప్రయాణీకులే లక్ష్యంగా దొంగతనాలు చేస్తోన్న ఓ ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 110 రోజుల్లో 200 ప్రయాణాలు చేసి 6 దొంగతనాలు చేసి రూ.2 కోట్ల సొత్తు కాజేసిన రాజేష్ కపూర్ అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఢిల్లీకి చెందిన రాజేష్ కపూర్ మొబైల్ ఫోన్ల రిపేర్ షాపు నడిపేవాడు. విలాసాలకు అలవాడు పడి, దొంగతనాలకు దిగాడు. విమానాల్లో ధనవంతులు ప్రయాణాలు చేస్తుంటారని భావించాడు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే లింకు విమానాల్లోని వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటాడు. సూటు, బూటు వేసుకుని ధనవంతుడి మాదిరి తయారవుతాడు. తన లగేజీని, లక్ష్యంగా చేసుకున్న వారి బ్యాగేజీ పక్కనే పెడతాడు. వారు నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగులోని విలువైన వస్తువులు లాగేసి, తన బ్యాగులో సర్ధుకుంటాడు. విమానాశ్రయంలో దిగి దర్జాగా వెళ్లిపోతాడు. ఇలా పదుల సంఖ్యలో దొంగతనాలు చేశాడు.
ఎలా దొరికాడు
చాలా మంది ప్రయాణీకులు వస్తువులు, బంగారం, డబ్బు పోయినా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. కొందరు ప్రయాణీకుల నుంచి లక్షల విలువ చేసే బంగారం, డబ్బు కొట్టేయడంతో పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు వరుస దొంగతనాలు జరిగిన తరవాత ఆ విమానాశ్రయాల సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. రాజేష్ కపూర్ రెండు చోట్లా అనుమానాస్పదంగా కనిపిండచంతో పోలీసులు నిఘా వేసి అరెస్ట్ చేశారు.