ప్రముఖ అర్బన్ నక్సలైట్, దేశ వ్యతిరేక రచయిత్రి అరుంధతీరాయ్‌ని ఉపా చట్టం కింద విచారించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఆ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన జారీ చేసింది. అరుంధతితో పాటు మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్‌ను కూడా విచారించాలని ఎల్‌జి ఆదేశించారు.
రచయిత్రి అరుంధతీ రాయ్, కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్ 2010లో ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. కశ్మీరీ యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసారు. ఆ వ్యవహారంపై సుశీల్ పండిట్ అనే వ్యక్తి 2010 అక్టోబర్ 28న ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదయింది.
ఆ ఇద్దరు నిందితులనూ ఐపీసీ సెక్షన్ 196 కింద విచారించడానికి ఎల్‌జి 2023 అక్టోబర్‌లో అనుమతినిచ్చారు. ఇప్పుడు అదే కేసులో వారిని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 45(1) కింద విచారించడానికి ఎల్‌జి అనుమతి మంజూరు చేసారు.
2010 అక్టోబరన్ 21న న్యూఢిల్లీ కోపర్నికస్ మార్గ్‌లోని ఎల్‌టిజి ఆడిటోరియంలో ‘ఆజాదీ – ఒకే ఒక మార్గం’ పేరిట ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో అరుంధతీ రాయ్, ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుసేన్ పాల్గొన్నారు. యువతను రెచ్చగొట్టేలాంటి ఉపన్యాసాలు చేసారు. ఆ సమావేశంలో వారి ప్రసంగాలు, అనంతర చర్చలూ ‘భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీసేయాలి’ అనే అంశాన్ని ప్రచారం చేసాయి.
ఆ కాన్ఫరెన్స్‌లో సయ్యద్ అలీషా గిలానీ, ఎస్ఎఆర్ గిలానీ, అరుంధతీ రాయ్, డా షేక్ షౌకత్ హుసేన్, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావు పాల్గొన్నారు.
‘‘జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగం కాదు, భారతదేశపు సైనిక బలగాలు కశ్మీర్‌ను బలవంతంగా ఆక్రమించుకున్నాయి, జమ్మూకశ్మీర్‌కు భారత్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించడానికి వీలైన ప్రయత్నాలన్నీ చేయాల్సిందే’’ ఆ సమావేశంలో గిలానీ, అరుంధతీ రాయ్ ప్రసంగాలు చేసారు. వారి ప్రసంగాల రికార్డింగులను ఫిర్యాదిదారుడు తన ఫిర్యాదుతో పాటు సమర్పించారు.
అరుంధతీ రాయ్, షేక్ షౌకత్ హుసేన్‌లపై ఫిర్యాదిదారుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 156(3) కింద న్యూఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసాడు. దాన్ని కోర్టు 2010 నవంబర్ 27న విచారించింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. ఆ మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.