టీ20 వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు సౌతాఫ్రికను నానా తిప్పలు పెట్టింది. ఉత్కంఠ పోరులో ఆఖరి బంతి వరకు ఆడి ఒక్క పరుగు తేడాతో నేపాల్ ఓడింది.
నేపాల్ జట్టు ఓడినప్పటికీ అద్భుతమైన పోరాటపటిమతో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది.
వరల్డ్‌కప్-2024 టోర్నీ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకోగా నేపాల్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడటంతో ఇంటి బాటపట్టింది.
నేటి ఉదయం సెయింట్ విన్నెంట్ వేదికగా జరిగిన నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు నేపాల్ చుక్కలు చూపింది. టాస్ గెలిచిన నేపాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
స్పిన్నర్ కుశాల్ భూర్తేల్ నాలుగు వికెట్లు తీయగా పేసర్ దీపేంద్ర సింగ్ మూడు వికెట్లు తీశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(43) ట్రిస్టన్ స్టబ్స్(27*) రాణించారు.
లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ను సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్ ఆసిఫ్ షేక్(42) అనిల్ సా(27) విజయం కోసం పోరాడారు.
నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నేపాల్ 114 పరుగులు మాత్రమే చేసి ఓడింది. విజయానికి అవసరమైన ఒక్క పరుగు చేయలేకపోయింది. నేపాల్‌పై విజయంతో గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లో సౌతాఫ్రికా గెలిచింది.