ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్ర మోదీ జి-7 సదస్సులో పాల్గొనడానికి ఇటలీ వెళ్ళారు. జి-7లో భారత్ సభ్యురాలు కానప్పటికీ ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి పెరుగుతున్న విలువకు నిదర్శనం, గత పదేళ్ళ ఎన్డీయే పరిపాలనలో దేశం సుస్థిరతను సాధించడం, విదేశీ వ్యవహారాల్లో నిలకడైన వైఖరిని ప్రదర్శిస్తుండడం, ఆర్థికంగా బలోపేతం అవడం వల్లనే భారత్‌ను విస్మరించలేని పరిస్థితి ఏర్పడింది.
జి-7 సదస్సు ఇటలీలోని అపులియా ప్రాంతంలో బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జరిగింది. ‘ఔట్రీచ్ కంట్రీ’గా భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.
నరేంద్ర మోదీ జి-7 సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్, యుకె ప్రధానమంత్రి ఋషి శునక్లతో పాటు వాటికన్ పోప్ ఫ్రాన్సిస్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆతిథ్య దేశం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లతోనూ చర్చలు జరిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనను భారతదేశాన్ని సందర్శించడానికి ఆహ్వానించారు. ప్రజాసేవలో, ఈ భూగోళాన్ని మెరుగైన ఆవాసంగా తీర్చిదిద్దడంలో పోప్ చేస్తున్న సేవలను కొనియాడారు.
కొన్నాళ్ళుగా భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్న కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోను కూడా మోదీ కలుసుకున్నారు. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో గతేడాది తమ దేశ పార్లమెంటులో ప్రకటించిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలూ ఇబ్బందికరంగా మారాయి. ఆ సంఘటన తర్వాత ఇరుదేశాల ప్రధానమంత్రులూ భేటీ అవడం ఇదే మొదటిసారి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపాక, తమ సమావేశం ఫలవంతంగా జరిగిందని మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోడానికి భారత్ ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ చర్చలు, దౌత్య విధానాలతోనే శాంతి సాధ్యమవుతుందన్నది భారత్ విశ్వాసం అని పునరుద్ఘాటించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్‌తో మోదీ భేటీ ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్వీట్ చేసారు. రక్షణ, అణుశక్తి, అంతరిక్షం, విద్య, వాతావరణ పరిరక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కీలక సాంకేతికతలు, కనెక్టివిటీ తదితర రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత ముందుకు సాగుతుందని వెల్లడించారు. ముఖ్యమైన ప్రాదేశిక, అంతర్జాతీయ వ్యవహారాల మీద ఇద్దరు నేతలూ తమతమ దేశాల అభిప్రాయాలను పంచుకున్నారని వివరించారు.
జి-7 సదస్సు మొదటి రోజు రష్యా ఉక్రెయిన్ ఘర్షణల మీదనే ఎక్కువ చర్చ జరిగింది. ఫ్రీజ్ చేసిన రష్యా ఆస్తులను ఉపయోగించి ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలని అమెరికా ప్రతిపాదించింది. దానికి జి-7 సభ్య దేశాల నాయకులు అంగీకరించారు. తద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బలమైన సందేశం పంపినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇటలీ నుంచి స్వదేశానికి బయల్దేరే ముందు మోదీ తన వీడ్కోలు సందేశంలో, మూడోసారి ప్రధాని అయ్యాక తన తొలి విదేశీ పర్యటన జి-7 సదస్సు కోసం ఇటలీలో జరగడంపై హర్షం వ్యక్తం చేసారు.
‘‘2021లో జి-20 సదస్సు కోసం ఇటలీ వచ్చాను. ఇటలీ ప్రధాని మెలోనీ గతేడాది భారత్‌కు రెండుసార్లు వచ్చారు. ఆ పర్యటనలు ఇరుదేశాల ద్వైపాక్షిక అజెండాను బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికీ ఎంతగానో సహాయపడ్డాయి. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇండో పసిఫిక్, మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో పరస్పరం సహకరించుకుంటాం’’ అని మోదీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ టర్కీ, గ్రీస్, యుఎఇ, జోర్డాన్, బ్రెజిల్ తదితర దేశాల అధినేతలతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గెటెరెస్తోనూ భేటీ అయ్యారు.