ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ విస్తరణలో మందగమనం ఏర్పడింది. ఈ నెల 2న రాష్ట్రాన్ని తాకినప్పటికీ అదే వేగంలో విస్తరించలేదు.
ఉత్తరాంధ్రకు నైరుతి మేఘాలు ఇంకా చేరుకోలేదు. ఈ నెల 8న గోదావరి జిల్లాలను దాటినప్పటికీ నేటికీ ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను పలకరించేందుకు మరో రెండుమూడు రోజులు పట్టే అవకాశం ఉంది.
రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శుక్రవారం పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. విజయనగరం జిల్లా రాజాంలో 78.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.