తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖలో పనిచేస్తున్నారు. గతంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా చేసిన సమయంలో జీఎస్టీని పక్కాగా అమలు చేసి రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచడంలో సఫలమయ్యారని తెలుస్తోంది. సమర్థ అధికారిగా, ముక్కుసూటి వ్యక్తిగా శ్యామలరావుకు మంచి పేరుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవుపై పంపించడంతో ఈవో నియామకం తప్పనిసరైంది. గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డి ఈవోగా చేశారు. ఆ తరవాత ధర్మారెడ్డిని ఈవోగా నియమించాలని ప్రయత్నించారు. అతనికి ఈవో నియామకానికి అర్హత లేకపోవడంతో అదనపు ఈవో బాధ్యతలు అప్పగించి ఈవో పోస్టు ఖాళీగా ఉంచారు.