తెలుగు సినీ నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమను కర్ణాటక సీఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హేమ డ్రగ్స్ ఉపయోగించారంటూ సీఐడి బెంగళూరు కోర్టులో పిటిషన్ వేయడంతో మొదట ఆమెను 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించారు. హేమ డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు సరైన ఆధారాలు చూపలేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
రేవ్ పార్టీ జరిగిన పది రోజుల తరవాత హేమ నుంచి రక్తం శాంపిల్స్ తీసుకుని పరీక్షలు జరిపారని, వాటి వివరాలు కూడా కోర్టుకు ఇవ్వలేదని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నటి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న బెంగళూరు కోర్టు నటి హేమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
నటి హేమను బెంగళూరు జైలు నుంచి విడుదల చేశారు. బర్త్ డే పార్టీ మాత్రమే చేసుకున్నామని, డ్రగ్స్ వినియోగించలేదని నటి హేమ మీడియాతో చెప్పారు. అయినా మీడియాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదంటూ హేమ అక్కడి నుంచి వెళ్లిపోయారు.