కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. అల్ మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 45 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. బాధిత కుటుంబాలు కూడా విమానాశ్రయానికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో పాటు పలువురు విమానాశ్రయంలో బాధిత కుటుంబాలను ఓదార్చారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మృతదేహాలను తరలించేందుకు భారత వాయుసేన విమానంతో పాటు కేంద్రమంత్రి కీర్తివర్ధన్ ను అక్కడకు పంపింది. మృతుల్లో 23 మంది కేరళీయులు ఉండగా తమిళనాడుకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు ముగ్గురు, కర్ణాటక కు చెందిన ఒక వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో విమానం కొచ్చి నుంచి దిల్లీ వెళ్ళనుంది.