అయోధ్యలో ఇటీవల నిర్మించిన రామ మందిరాన్ని పేల్చేస్తామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ బెదిరించింది. ఆ నేపథ్యంలో అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసారు. హై అలర్ట్ ప్రకటించి, నగరాన్ని జల్లెడ పడుతున్నారు.
జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేసారు. అయోధ్యలో కొత్తగా కట్టిన గుడిని పేల్చేస్తామని ప్రకటించారు. అంతేకాదు, 2001లో అయోధ్య రామాలయంపై జరిగిన దాడి గురించి ప్రస్తావించారు. ఆ నేపథ్యంలో మందిరం దగ్గర రక్షణ చర్యలు ముమ్మరం చేసారు.
ఒక్క అయోధ్య ఆలయం దగ్గరే కాదు, అసలు అయోధ్యలో గుడి కట్టుకున్న పాపానికి భారతదేశం మీద మరిన్ని దాడులు చేస్తామంటూ పాకిస్తానీ ఉగ్రవాదులు బెదిరిస్తున్నారు. ‘హిందుత్వ శక్తులు’, అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతామంటూ టెర్రరిస్టులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశం నుంచి పారిపోయిన ఉగ్రవాది, ఎన్నో ఉగ్రవాద నేరాల్లో నిందితుడిగా ఉన్న ఫరాతుల్లా ఘోరీ అయోధ్యపై దాడి చేస్తామని బెదిరించాడు. ఇటీవలే రియాసీలో హిందూ భక్తుల బస్సును పేల్చేసిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఉగ్రవాద సంస్థ కూడా అదే హెచ్చరిక జారీ చేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తయ్యబా అనుబంధ సంస్థ అది. ఆ బెదిరింపులు రెండూ రామమందిర ప్రాణప్రతిష్ఠను ‘సైతాను చర్య’గా అభివర్ణించాయి, అక్కడ గుడి కట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాయి.
ఫరాతుల్లా ఘోరీ ‘రామమందిరం:యుద్ధ ప్రకటన’ పేరుతో వీడియో విడుదల చేసాడు. భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేయడమే తమ లక్ష్యమని ప్రకటించాడు. దానికోసం బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్లపై జిహాద్ చేస్తామని ప్రకటించాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ మాజీ నాయకులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్, మరికొందరు మీడియా వ్యక్తుల చిత్రాలను ఆ వీడియోలో ప్రదర్శించారు. వారిని హతమార్చడమే తమ లక్ష్యం అన్న భావం వచ్చేలా మాట్లాడారు.
భారతదేశంలోని ముంబై, హైదరాబాద్, భత్కల్, ఆజంగఢ్ వంటి నగరాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తగ్గిపోతోందంటూ ఘోరీ ఆవేదన వ్యక్తం చేసాడు. ఔరంగాబాద్‌కు చెందిన ఫయాజ్ సయ్యద్, మాజీ ఎంపీ మొహమ్మద్ అసద్ మదానీ వంటి ఉదారవాద ముస్లిములను ‘అమ్ముడుపోయిన వాళ్ళు’ అని విమర్శించాడు. ఆ వీడియోలో రామమందిరం, హ్యాండ్ గ్రెనేడ్స్, కత్తులు, ఆత్మాహుతి జాకెట్లు, బులెట్లు, తుపాకులు బుల్డోజర్లతో ఇళ్ళను కూలగొడుతున్న దృశ్యాల చిత్రాలను సైతం ప్రదర్శించారు.
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠను సాకుగా చూపి భారత్ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టి బలహీన మనస్కులైన యువకులను రిక్రూట్ చేసుకుని భారత్‌పై దాడులు చేయడానికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని దేశీయ భద్రతా నిపుణులు భావిస్తున్నారు.