కమల్ చంద్ర దర్శకత్వంలో అన్నూకపూర్ నటించిన సినిమా ‘హమారే బారహ్’ సినిమాను విడుదల చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా ఇవాళ విడుదల కావలసి ఉండగా సర్వోన్నత న్యాయస్థానం నిన్న తన ఆదేశాలు జారీ చేసింది. తాము సినిమా ట్రయిలర్ చూసామని, అది ప్రమాదకరంగా ఉందనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ సినిమా ఇస్లాం మతాన్ని, ప్రత్యేకించి వివాహిత ముస్లిం మహిళలను అవమానించేలా ఉందంటూ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది.
‘‘మేం సినిమా ట్రయిలర్ చూసాం. దాన్నిండా అవమానకరమైన మాటలే ఉన్నాయి’’ అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. హమారే బారహ్ సినిమాను ప్రదర్శించడానికి అనుమతిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ‘‘హైకోర్టు ముందున్న పిటిషన్ విచారణ పూర్తి చేసేవరకూ ఈ సినిమా స్క్రీనింగ్‌ను నిలిపివేయాలి’’ అని ఆదేశించింది.
‘హమారే బారహ్’ చిత్రం సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని, సినిమా విడుదలను నిలిపివేయాలనీ కోరుతూ అజర్ బాషా తంబోలీ అనే వ్యక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి)కి వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.
హమారే బారహ్ చిత్రం సినిమాటోగ్రాఫ్ చట్టంలోని అంశాలకు విరుద్ధంగానూ, ఆ చట్టం నియమ నిబంధనలకు వ్యతిరేకంగానూ ఉందని అజర్ బాషా ఆరోపించాడు. సినిమా ట్రయిలర్ ఇస్లాం విశ్వాసాలకూ, భారతదేశంలోని వివాహిత ముస్లిం మహిళలకూ వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసాడు.
ఆ ఆరోపణలను సిబిఎఫ్‌సి కొట్టిపడేసింది. సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయడంలో అన్ని విధివిధానాలనూ సరిగ్గా పాటించామని వెల్లడించింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులను తొలగించామని వివరించింది. యూట్యూబ్‌లో ఉన్న ట్రయిలర్‌కు సర్టిఫికెట్ లేదని వెల్లడించింది.
హమారే బారహ్ సినిమా జూన్ 7న విడుదల కావలసి ఉంది. ఆరోపణల నేపథ్యంలో బొంబాయి హైకోర్టు సినిమా విడుదలను జూన్ 14కు వాయిదా వేసింది. ముగ్గురు సభ్యులతో రివ్యూ కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీ తమ నిర్ణయం చెప్పడానికి మరింత సమయం కావాలని కోరింది. దాంతో, హైకోర్టు కొన్ని వివాదాస్పద డైలాగులను తొలగించాలని సినిమా దర్శక నిర్మాతలకు సూచించింది. దానికి వారు అంగీకరించడంతో సినిమా విడుదలకు అనుమతించింది.
‘‘130 కోట్ల పౌరులున్న దేశంలో ఒక వ్యక్తి, చిత్ర నిర్మాతలకు అయిన ఖర్చులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా, ఒక సినిమా విడుదలను నిలిపివేయాలని కోరలేడు’’ అని వ్యాఖ్యానిస్తూ, బొంబాయి హైకోర్టు సినిమా విడుదలకు అనుమతి మంజూరు చేసింది.
కానీ సుప్రీంకోర్టు మాత్రం సినిమా విడుదలను అడ్డుకుంది. మొదట, హైకోర్టులో కేసు విచారణ పూర్తి కావాలంటూ మెలిక పెట్టింది. కేసు విచారణను వారం రోజుల్లో ముగించేలా హైకోర్టుకు సూచించాలంటూ చిత్ర నిర్మాతలు చేసుకున్న విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. కొద్దిరోజుల క్రితమే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ సినిమా విడుదలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
కోర్టుల ఉత్తర్వుల్లో వైరుధ్యాలు, నెటిజెన్ల విమర్శలు
ఈ సినిమా విషయంలో సుప్రీం ఉత్తర్వులు ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. గతంలో ఆమిర్‌ఖాన్ సినిమా ‘పీకే’ కేసును ఉదాహరిస్తున్నారు. ఆ సినిమాలో హిందూ దైవాలను అవమానించారు. దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పుడు కోర్టు ఆ అభ్యంతరాలను కొట్టిపడేసింది. ‘‘మీకు నచ్చకపోతే, మీరు సినిమాను చూడకండి’’ అంటూ తీవ్రంగా స్పందించింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, హమారే బారహ్ సినిమా విషయంలో కోర్టు తీరును నెటిజెన్లు తప్పుపడుతున్నారు.
2015లో పీకే సినిమా విడుదలైనప్పుడు ఆ చిత్రం హిందూ సంస్కృతిని, హిందువుల ఆచార వ్యవహారాలనూ తప్పుధోరణిలో చూపించేలా అవమానకరంగా ఉందంటూ కేసు దాఖలైంది. అయితే ఢిల్లీ హైకోర్టు పిటిషనర్ల అభ్యంతరాలను కొట్టిపడేసింది. ఆమిర్‌ఖాన్ నటించిన పీకే చిత్రంలో హిందూధర్మాన్ని, హిందువుల విశ్వాసాలనూ అవమానించే ఎలాంటి దృశ్యాలూ లేవని పేర్కొంది. ఆ చిత్రం హిందూసంస్కృతిని, హిందూమతాచారాలనూ అవమానించిందన్న ఆరోపణల్లో పసలేదని కొట్టిపడేసింది.
చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాలతో కూడిన ధర్మాసం ‘పీకే’ సినిమాలో ఏ తప్పూ లేదని తీర్మానించింది. ‘‘ఆ సినిమాలో తప్పేముంది? ప్రతీ విషయాన్నీ నేరంలా చూడకండి. మీ పిటిషన్లో చేసిన ఆరోపణల్లో పస లేదు’’ అని వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ‘హమారే బారహ్’ సినిమాపై సుప్రీం తీర్పును ఆనాటి ‘పీకే’ సినిమాపై తీర్పుతో పోలుస్తూ న్యాయస్థానం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
‘‘హమారా బారహ్ చిత్రం జనాభా విస్ఫోటనం అనే ఒక సామాజిక అంశం మీద రూపొందించారు. అది ముస్లిములకు నచ్చలేదు, కాబట్టి సుప్రీంకోర్టు ఆ సినిమాని నిషేధించింది. మరి, భావప్రకటనా స్వేచ్ఛ ఎక్కడుంది మిలార్డ్? హిందూమతాన్ని అవహేళన చేసే చిత్రాలకు మాత్రమే భావప్రకటనా స్వేచ్ఛ వర్తిస్తుందా?’’ అంటూ సిన్హా అనే వ్యక్తి ‘ఎక్స్’లో ట్వీట్ చేసాడు.
చిత్ర యూనిట్‌కు బెదిరింపులు
‘హమారే బారహ్’ చిత్ర నిర్మాతలు, నటీనటులు కొన్నాళ్ళ క్రితమే ఆందోళన వ్యక్తం చేసారు. తమకు మాత్రమే కాక తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. వారికి మహారాష్ట్రలో రక్షణ ఉంటుందని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు.
చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన అదితీ ధీమన్, తనకు ప్రతీరోజూ తన తల నరికేస్తామని, అత్యాచారం చేసి చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని చెప్పింది. ‘‘సర్ తన్ సే జుడా చేస్తామని, రేప్ చేసి హతమారుస్తామనీ ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. వారు నాకు సోషల్ మీడియాలో ప్రైవేట్ మెసేజ్‌లు పెడుతున్నారు. వారిలో మూడొంతుల మంది నకిలీగాళ్ళు, లేదా ఊరూపేరూ లేని వాళ్ళు. ఒక కళాకారిణిగా అది చాలా బాధాకరం. కానీ, వాటిని విస్మరించడం మినహా ఏమీ చేయలేము’’ అంటూ అదితి ధీమన్ తన ఆవేదన వెళ్ళగక్కుకుంది.
హమారే బారహ్ కథేంటి?
ఈ సినిమా మన్సూర్ అలీఖాన్ సంజరీ అనే వ్యక్తి కథ. అతని భార్య ప్రసవ సమయంలో సరైన ఆస్పత్రికి వెళ్ళడం ఆలస్యమై చనిపోయింది. మన్సూర్ రెండో భార్యకు ఐదుగురు పిల్లలు పుడతారు. ఆమె ఆరోసారి గర్భిణీ. ఆ ప్రసవం జరిగితే ఆమె ప్రాణాలకు ముప్పు అని వైద్యులు చెబుతారు. కానీ గర్భస్రావానికి మన్సూర్ ఒప్పుకోడు. అతని మొదటి భార్య కుమార్తె అల్ఫియా తన సవతితల్లిని రక్షించుకోవాలని నిర్ణయిస్తుంది, తన తండ్రి మీద కోర్టులో కేసు వేస్తుంది. ఆమె న్యాయస్థానాన్నీ, తన తండ్రినీ ఒప్పించగలిగిందా? తమ సమాజంలోని పితృస్వామ్య ఆధిక్యాన్ని ఎదిరించగలిగిందా? అనేదే మిగిలిన కథ.