రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారం కీలక దశకు చేరింది. ప్రపంచంలోనే అత్యాధునికమైన రఫేల్ యుద్ద విమానాలను, భారత్ ప్రాన్స్ నుంచి ఇప్పటికే 36 కొనుగోలు చేసింది. మరో 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు గత నెలలోనే చర్చలు జరిగాయి. అయితే ఎన్నికల కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఫ్రాన్సుకు చెందిన అధికారులు ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రఫేల్ ధర, వాటి నిర్వహణ, మోహరింపు విషయాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ డీల్ విలువ దాదాపు రూ.50 వేల కోట్లు ఉంటుందని అంచనా.
ఇప్పటికే ఫ్రాన్సు నుంచి భారత్‌కు 36 రఫేల్ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. ఇక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ డేగలాంటి యుద్ధ నౌకల నుంచి రఫేల్ యుద్ధ విమానాలను కీలక ప్రాంతాల్లో మోహరించేందుకు భారత రక్షణ శాఖ సిద్దమవుతోంది. ఫ్రాన్సు నుంచి మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు అందితే విశాఖలోని నేవీ బేస్‌లో కూడా వాటిని మోహరించనున్నారని తెలుస్తోంది.
తాజాగా చర్చలు జరుపుతోన్న మెరైన్ రఫేల్ యుద్ధ విమానాలు కూడా భారత్‌కు అందితే వాటి సంఖ్య 62కు చేరుతుంది. భారత రక్షణ రంగం మరింత బలపడుతుంది. పొరుగు దేశం చైనా నుంచి తలెత్తుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ రంగాన్ని ఆధునికీకరిస్తున్నారు.