ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్ళీ హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు జిల్లాల్లో విధ్వంసకాండ చెలరేగింది. ఒకచోట కొత్తగా కట్టిన పాఠశాల భవనాన్ని తగులబెట్టేసారు. మరో జిల్లాలో పలు ఇళ్ళను ధ్వంసం చేసారు. కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తిని తల నరికి చంపిన ఘటనకు కొనసాగింపుగా ఈ హింసాకాండ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
జూన్ 12 అర్ధరాత్రి వేళ, మణిపూర్ సరిహద్దుల్లోని మోరే పట్నం దగ్గరలో ఉన్న టి మోతా గ్రామంలో కొత్తగా కట్టిన జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఆ పాఠశాలకు ఇంకా ప్రారంభోత్సవమైనా కాలేదు. బడికి సమీపంలోనే అస్సాం రైఫిల్స్ పోస్ట్ ఉంది. అయితే గ్రామస్తులు బడికి దారితీసే అన్ని రహదారులకూ అడ్డంగా పెద్దపెద్ద దుంగలు పడేసి, భద్రతా బలగాలు పాఠశాల దగ్గరకు చేరకుండా అడ్డుకున్నారు. ఆ గ్రామంలో అనాల్ తెగ వారి జనాభా ఎక్కువగా ఉంది.
గతేడాది మే 3న చురాచాంద్‌పూర్ జిల్లాలో హింసాకాండ జరిగినప్పటినుంచీ దానికి సమీపంలో ఉన్న మోరే పట్టణం దాదాపు మూతపడే ఉంది. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న మోరే, మణిపూర్‌లోని అతిపెద్ద వ్యాపార కేంద్రాల్లో ప్రధానమైన పట్టణం మాత్రమే కాదు, అక్రమ చొరబాట్లకు కేంద్రం కూడా. మోరే సహా దాని చుట్టుపక్కల ఉన్న సాహే, హాలోన్‌ఫాయ్, టి మినో, గోవజాంగ్, బి బొంగ్‌జాంగ్ వంటి ప్రాంతాల్లో మయన్మార్‌కు చెందిన సాయుధ దళాలు స్థావరాలు ఏర్పరచుకుని ఉన్నాయని అనధికార సమాచారం.
మరో ఘటనలో, జిరిబామ్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇళ్ళపై దాడులు జరిగాయి. జూన్ 12 రాత్రి 10.30 తర్వాత కాళీనగర్ ప్రాంతంలో హ్మార్ తెగకు చెందిన వ్యక్తి దుకాణాన్నీ, మూడు ఇళ్ళనూ గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. పోలీసులు వెంటనే స్పందించి నిప్పు ఆర్పేసారు. అయితే మరో మూడుగంటలకే, అంటే అర్ధరాత్రి దాటాక 1.30 సమయంలో అదే ప్రాంతంలోని మరో మూడు ఇళ్ళకు నిప్పు పెట్టారు. పోలీసులు వాటిని కూడా అదుపు చేయగలిగారు.
గతేడాది మణిపూర్‌లో కుకీలు మెయితీలపై దాడులు మొదలుపెట్టినప్పటినుంచీ ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం అదుపులోకి రావడం లేదు. అతికష్టం మీద నియంత్రణలోకి వచ్చినా అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న జూన్ 11న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కాన్వాయ్ మీదనే సాయుధ మిలిటెంట్లు దాడి చేసారు. దానివల్ల జిరిబామ్ పట్నంలో బాధిత ప్రజలను ముఖ్యమంత్రి కలుసుకునే కార్యక్రమం ఆలస్యమైంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు