సామాజిక పింఛను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు జులై నుంచి రూ. 4 వేలు అందజేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు.
అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచి నెలకు రూ. 4 వేల పింఛను ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఏప్రిల్, మే, జూన్లో చెల్లించాల్సిన ఒక్కో వెయ్యి రూపాయలతోపాటు జులై నెల పింఛన్ రూ. 4 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు అందిస్తారు. ఆగస్టు నుంచి రూ. 4 వేల చొప్పున పంపిణీ చేస్తారు.
వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, కళాకారులు పింఛన్ల లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు.
దివ్యాంగులకు ప్రస్తుతం రూ. 3 వేలు ఇస్తుండగా, ఇకపై రూ. 6 వేలు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన మంచానికి పరిమితమైన వారికి ప్రస్తుతం అందుతున్న సాయం రూ. 5 వేల పెన్షన్ స్థానంలో ఇకపై రూ. 15 వేలు అందిస్తారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కుష్ఠువ్యాధి కారణంగా వైకల్యం ఉంటే రూ. 6 వేలు ఇస్తారు.