కువైట్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 49కి చేరింది. వీరిలో 24 మంది కేరళవాసులు కాగా, 7 మంది తమిళనాడుకు చెందిన వారు. మరో ముగ్గురు ఏపీ కార్మికులు ఉన్నారని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. మిగిలినవారు ఉత్తరాదిరాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కువైట్‌లో అల్ మంగాఫ్ ప్రాంతంలో ఓ అపార్టుమెంటు వంటగదిలో చెలరేగిన మంటలతో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 49 మంది చనిపోగా, వారిలో 42 మందిని భారతీయులుగా గుర్తించారు.
అల్ మంగాఫ్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిలో ముగ్గురు ఏపీ వాసులున్నారని అధికారిక ప్రకటన వెలువడింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండువల్లికి చెందిన సత్యానారాయణ, అన్నవరప్పాడు గ్రామస్థుడు మీసాల ఈశ్వరుడు ఉన్నట్లు తేలింది.
అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. కేరళ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. లులు గ్రూప్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారిని భారత్‌కు తరలించేందుకు వాయుసేన విమానం సిద్ధంగా ఉంచారు. భారత విదేశాంగ మంత్రి కువైట్ వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.