బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది.ఎంపీ హత్య కేసులో అరెస్టైన బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ సియాజ్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నేపాల్‌కు చెందిన కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎంపీని కోల్‌కతా రప్పించేందుకు ఓ మహిళతో హనీట్రాప్ వేశారు. కోల్‌కతాలోని ఓ అపార్టుమెంటుకు రాగానే ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసినట్లు నిందితులు తెలిపారు. ఎంపీ హత్యలో ఇప్పటికే అరెస్టైన మహిళ కూడా పాల్గొన్నట్లు వారు తెలిపారు.
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసును బెంగాల్ సీఐడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత నెల 12న ఎంపీ కనిపించడం లేదంటూ ఆయన స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఎంపీ హత్య కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. హత్య తరవాత ఎంపీ శరీరాన్ని ముక్కలుగా చేసి న్యూ టౌన్‌లోని పలు కాలువల్లో పడేశారు. అపార్టుమెంటు సెప్టిక్ ట్యాంకు నుంచి కొన్ని కిలోల శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ హత్యకు ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ.5 కోట్లు సుఫారీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.