ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నేటి ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వాదం అందుకున్నారు. చంద్రబాబుకు స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ అధికారులు అందజేశారు.అఖిలాండం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి,మనవడు దేవాన్ష్ ఉన్నారు.
చంద్రబాబు స్వామిని దర్శించుకునే సమయంలోనే కేంద్రమంత్రి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సైతం కుటుంబంతో కలిసి శ్రీవారి సేవకు విచ్చేశారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని చంద్రబాబు కుటుంబం దర్శించుకుంది. వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు.ఆలయం వద్ద భక్తులు మంత్రి నారా లోకేశ్ తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.
తిరుమల పర్యటన తర్వాత విజయవాడ చేరుకున్న సీఎం చంద్రబాబు, ఫ్యామిలీతో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.