ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయానికి గల నాలుగు ద్వారాలు తెరిచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నేటి ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రులు పాల్గొన్నారు.
నేటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి పూరి జగన్నాథుడిని దర్శించుకోవచ్చు అని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసినట్లు చెప్పిన సీఎం…ఆలయ పరిరక్షణకు రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు, వచ్చే బడ్జెట్లో నిధులు విడుదల చేస్తామన్నారు.
ఇప్పటి వరకు ఒక్క ద్వారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా రాకముందు నాలుగు ద్వారాల నుంచి భక్తుల ప్రవేశానికి అనుమతి ఉండేది. కొవిడ్ నేపథ్యంలో ఒక్క ద్వారా నుంచే భక్తులను అనుమతించారు. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడంతో నేడు ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.