కువైట్ అగ్ని ప్రమాద బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 42 మంది భారతీయులేనని అధికారులు గుర్తించారు. భారత్ నుంచి నిర్మాణ రంగంలో పనిచేయడానికి కువైట్ వెళ్లిన వారికి ఓ ప్రైవేటు సంస్థ అపార్టుమెంటులో బస ఏర్పాటు చేసింది. ఐదంతస్తుల భవనంలో 195 మందికి నివాసం ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున వంట గదిలో చెలరేగిన మంటలు భవనాన్ని చుట్టుముట్టాయి. కార్మికులు తప్పించుకోలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే సమయానికి ఘోరం జరిగిపోయింది. 49 మంది చనిపోయారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చనిపోయిన వారిలో అత్యధికులు కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారి మృతదేహాలను భారత్ తీసుకువచ్చేందుకు ఎంబసీ అధికారులు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.