టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ పోరులో భారత్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అమెరికాను ఓడించి ‘సూపర్–8’ దశకు చేరింది. అమెరికా పోరాడినప్పటికీ చివరకు భారత్ ముందు తలవంచక తప్పలేదు. భారత ఆటగాళ్ళలో సూర్యకుమార్, శివమ్ దూబే జోడీ మరో 10 బంతులు మిగిలి ఉండగా భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన USA జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (27), స్టీవెన్ టేలర్ (24) మాత్రమే ఫర్వాలేదనిపించారు. నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. భారత్ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసి విజయం సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, శివమ్ దూబే 35 బంతుల్లో 31పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో 67 పరుగులు జోడించారు.
తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న అమెరికా ఓవర్‌రేట్ నిబంధనలు పాటించడంలో వెనుకబడింది. దీంతో ఆ జట్టుకు అంపైర్లు 5 పరుగులు జరిమానా విధించారు.భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను శనివారం లాడర్‌హిల్‌లో కెనడాతో ఆడనుంది.