లోక్‌సభతో పాటు శాసనసభకూ ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం ఒడిషాలోనూ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే ఒడిషాలో మోహన్ చరణ్ మాఝీ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మోహన్ చరణ్ మాఝీ ఒడిషా 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, 8మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర సహాయమంత్రులతో కొత్త క్యాబినెట్ ఏర్పడింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిథులుగా హాజరయ్యారు.
ఒడిషాకు 25 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, తొలిసారి ఓడిపోయిన నవీన్ పట్నాయక్‌ను మోహన్ చరణ్ మాఝీ స్వయంగా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. నవీన్ పట్నాయక్ ఆ ఆహ్వానాన్ని మన్నించి మాఝీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త ముఖ్యమంత్రికి, కొత్త మంత్రివర్గానికి శుభాభినందనలు తెలియజేసారు.
ఒడిషా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. మొత్తం 147 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీ సాధించింది. గత ఎన్నికల్లో 112 సీట్లు గెలిచిన బీజేడీ ఇప్పుడు 61 సీట్లు కోల్పోయి 51 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ 14, సిపిఎం 1, స్వతంత్రులు 3స్థానాలు దక్కించుకున్నారు.
ఒడిషా ముఖ్యమంత్రి అయిన మూడవ ఆదివాసీ నాయకుడు మోహన్ చరణ్ మాఝీ. ఆయన విద్యార్ధి దశ నుంచే ఆరెస్సెస్ కార్యకర్త. విద్యాభ్యాసం పూర్తయాక సరస్వతీ విద్యామందిరంలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసారు. గ్రామ సర్పంచ్‌గా రాజకీయ రంగప్రవేశం చేసారు. 2000, 2009, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.