మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో హొత్తాల్ గ్రామంలో ప్రాచీన కాలం నాటి శివాలయం వెలుగు చూసింది. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో శివభగవానుడి దేవాలయం బైటపడిందని ఆ శాఖ ప్రకటించింది. ఒక ఆలయం పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా అక్కడ శిథిలాలను తొలగించే క్రమంలో ఈ పురాతన ఆలయం బైటపడింది.
హొత్తాల్ గ్రామంలో చాళుక్యుల కాలం నాటి మందిరాలు ఉన్నాయి. అక్కడ మూడు శిలాశాసనాలు కూడా బైటపడ్డాయి. సామాన్య శకం 1070లో ఆ మందిరాలను నిర్మించడానికి సహాయం చేసిన దాతల వివరాలు ఆ శిలా శాసనాల మీద ఉన్నాయని పురావస్తు అధికారులు చెప్పారు. ఆ ప్రాంతం ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల రాజధాని. అద్భుతమైన శిల్పాలతో అలంకరించిన ఆలయ సముదాయం ఆ ప్రాంతపు ప్రత్యేకత.
మహారాష్ట్ర పురావస్తు విభాగం నాందేడ్ డివిజన్ ఇన్ఛార్జ్ అమోల్ గోటే ఈ శివాలయం గురించి మీడియాకు వెల్లడించారు. తమకు దొరికిన కొన్ని ఆధారాలతో అక్కడ ఏదో నిర్మాణం ఉందని తెలిసిందని, దాని గురించి తెలుసుకోడానికి తవ్వకాలు జరిపామనీ వివరించారు. ఆ క్రమంలో ఒక శివలింగంతో కూడిన శివాలయం బైటపడిందని చెప్పారు. దానితో పాటు ఆ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు సైతం దొరికాయని వివరించారు.