నకిలీ డాక్యుమెంట్లతో ముంబైలో నివసిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. మరో ఐదుగురిని గుర్తించి, వారిని తనిఖీ చేస్తోంది. నిందితులు చాలాకాలం నుంచి ముంబైలో నకిలీ పత్రాలతో నివసిస్తున్నారనీ, వాటి ఆధారంగా ఓటర్ గుర్తింపు కార్డులు కూడా పొందారనీ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు సైతం వేసారనీ ఎటిఎస్ నిర్ధారించింది.
ఈ కేసు గురించి ఎటిఎస్ అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. జుహూ ఎటిఎస్ అధికారులకు ఇటీవల వచ్చిన సమాచారం మేరకు ముంబైలోని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. వారి పేర్లు రియాజ్ హుసేన్ షేక్ (33), సుల్తాన్ సిద్దిక్ షేక్ (54), ఇబ్రహీం షఫీయుల్లా షేక్ (44), ఫరూక్ ఉస్మాన్‌గనీ షేక్ (39). వారు బంగ్లాదేశ్ నవకాలీ జిల్లా నుంచి వచ్చారు, రియాజ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సుల్తాన్ రిక్షా తొక్కుతున్నాడు. ఇబ్రహీం కూరగాయలు అమ్ముతున్నాడు.
‘‘బంగ్లాదేశీయులైన ఈ నలుగురు నిందితులూ నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారు భారత్‌లోకి కొన్నేళ్ళ క్రితం అక్రమంగా చొరబడ్డారు. వాళ్ళు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వారిగా నకిలీ పత్రాలు చూపించి భారతీయ పాస్‌పోర్టులు సైతం పొందారు’’ అని ఎటిఎస్ అధికారులు వెల్లడించారు.
ఈ నలుగురే కాకుండా మరో ఐదుగురు కూడా అలాగే పాస్‌పోర్టులు పొందినట్లు తెలిసింది. వారిలో ఒకరు పని కోసం సౌదీ అరేబియా వెళ్ళారు. అంతేకాదు, వీరిలో కొంతమంది ఆ పాస్‌పోర్టుల సహాయంతో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటు కూడా వేసారు’’ అని ఎటిఎస్ అధికారులు వివరించారు.
అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల మీద ఎటిఎస్ అధికారులు కేసు నమోదు చేసారు. వారిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారేమో అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు