టీ20 ప్రపంచకప్ టోర్నీ-2024లో ఆస్ట్రేలియా జట్టు విజయాలతో దూసుకెళుతోంది. గ్రూప్-బిలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు తొలి మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించి, మరుసటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్ లో నమీబియాపై సునాయాశ విజయాన్ని అందుకుంది. దీంతో గ్రూప్-బి టాపర్‌గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది.
వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా జరిగిన పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జోష్ హాజిల్‌వుడ్ ధాటికి ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్(10), నికో డెవిన్( 2 ) పెవిలియన్ కు చేరుకున్నారు. జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 36 పరుగులు చేయగా అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేశారు. తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్ళు కూడా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులకు మాత్రమే పరిమితం అయ్యారు. ఆడం జంపా దెబ్బకు పెవిలియన్‌కు వరుసకట్టారు. 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే నమీబియా ఆలౌట్ అయింది.
లక్ష్యాన్ని ఛేదనలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేశారు. 5.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా సూపర్-8కు చేరగా ఆస్ట్రేలియా కూడా చేరింది.