ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే అధికారపక్షంగా అవతరించడంతో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేటి ఉదయం 11.27 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ నేతలు హాజరుకానున్నారు. దీంతో అట్టహాసంగా ఏర్పాట్లు జరిగాయి.
కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి వద్ద సభావేదిక ఏర్పాటు చేశారు. ఇరవై ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ టెంట్లను వేసి సందురంగా తీర్చిదిద్దారు. వేదికపై 60 మది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలను సుందరంగా తీర్చిదిద్దారు.
టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు 50 వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.
ప్రమాణస్వీకారం సందర్భంగా 10 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా.. విజయవాడలోనే 3 వేల మందిని మోహరించారు. గన్నవరం విమానాశ్రయం, కేసరవల్లి సభా ప్రాంగణం, వెలుపల 7 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొన్నారు. 60 మంది ఐపీఎస్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.