ఒడిశాలో బీజేపీ పాలకపక్షంగా అవతరించడంతో ఆ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసింది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మోహన్ మాఝీ పేరును ఫైనల్ చేసింది. కియోంజర్ శాసనసభ స్థానం నుంచి మోహన్ చరణ్ మాఝీ 87 వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
కనక్ వర్ధన్ సింగ్, ప్రవతి పరిడాలను డిప్యూటీ సీఎంలుగా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం, మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తోంది. ప్రవతి పరిడా నిమపర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు.
బీజేపీ, బీజేడీ కూటమి ప్రభుత్వం 2000 నుంచి 2004 వరకు ఏర్పడింది. ఆ తర్వాత బీజేడీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం బీజేపీ మొదటిసారి ఒడిశాలో అధికార పక్షంగా అవతరించింది.