ఇరాన్ అధ్యక్షుడి విమానం కుప్పకూలిన ఘటన మరవక ముందే మరో ఘోరం చోటు చేసుకుంది. మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా ప్రయాణిస్తోన్న విమానం కనిపించకుండాపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సిగ్నల్ అందకపోవడంతో పర్వత ప్రాంతాల్లో కూలిపోయి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తోన్న విమానంలో మరో ముగ్గురు సైనికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు.
కనిపించకుండా పోయిన విమానం కోసం సైన్యం గాలింపు చేపట్టింది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని సైన్యాధికారులు తెలిపారు. అగ్రదేశం అమెరికా కూడా గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయం చేస్తోంది. గాలింపు కార్యక్రమాల్లో బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా పాల్గొంటున్నాయి.
మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తోన్న విమానం గల్లంతై 24 గంటలు గడిచినా ఆచూకీ లభించలేదు. మలావీ రాజధాని లిలాంగ్వే నుంచి జుజుకు బయలు దేరిన విమానం సోమవారం ఉదయం కనిపించకుండా పోయింది. రాడార్‌తో లింకులు తెగిపోయాయి. విమానం కుప్పకూలినట్లు సైన్యం అనుమానిస్తోంది.