జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జూన్ 9న భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసింది తామేనంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ టిఆర్ఎఫ్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జిహాదిస్టు ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా అనుబంధ సంస్థ.
ఆ దాడిలో 10మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, 33మందికి గాయాలయ్యాయి. పర్యాటకులు, స్థానికేతరులపై అటువంటి మరిన్ని దాడులు జరుగుతాయని టిఆర్ఎఫ్ అనుబంధ వార్తా సంస్థ జీలం మీడియా హౌస్ వెల్లడించింది. రియాసీలో బస్సుపై దాడి ‘అటువంటి దాడులు మళ్ళీ మొదలుపెట్టడానికి ప్రారంభం మాత్రమే’ అని ప్రకటించింది.
జమ్మూకశ్మీర్‌లోకి బైటి ప్రదేశాల ప్రజలను రానీయకూడదన్నది టిఆర్ఎఫ్ లక్ష్యం. దానికోసం దాడులు చేయడం మాత్రమే కాదు, ఆ విషయాన్ని గర్వంగా ప్రకటించుకోవడం టిఆర్ఎఫ్ విధానం అని భారతీయ భద్రతా బలగాలు వివరించాయి.
‘‘రియాసీ బస్సు దాడి నేపథ్యంలో టిఆర్ఎఫ్ చేసిన ప్రకటనను గమనించాం. ఆ దాడికి బాధ్యత టిఆర్ఎఫ్‌దే అనడానికి ఆ ప్రకటన ఒక్కటే సరిపోదు. స్థానికేతరులను భయభ్రాంతులకు గురిచేయడం అనే తమ లక్ష్యాన్ని ప్రతిబింబించే ఏ దాడిని చూసినా వారు వేడుక చేసుకుంటారు. రియాసీ ఘటన బహుశా అలాంటి కేసు అయి ఉండవచ్చు’’ అని జమ్మూలోని ఒక పోలీసు అధికారి చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణం తొలగించిన తర్వాత 2019లో టిఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించింది. ఆ సంస్థను 2020 జనవరిలో ఉపా చట్టం కింద నిషేధించింది.
టిఆర్ఎఫ్ గురించి కేంద్ర హోంశాఖ 2023 మార్చిలో పార్లమెంటుకు రాతపూర్వకంగా వివరించింది. జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలను, అమాయక ప్రజలను హతమార్చడానికి ప్రణాళికలు వేయడం, నిషిద్ధ ఉగ్రవాద సంస్థలను సమన్వయం చేయడం, వాటికి ఆయుధాలు సరఫరా చేయడం, ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం, టెర్రరిస్టుల చొరబాట్లకు ఆర్థికంగా సహకరించడం, సరిహద్దుల వెంబడి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం వంటి కార్యకలాపాలకు టిఆర్ఎఫ్ పాల్పడుతోందని వివరించింది. టిఆర్ఎఫ్ ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్లతో పాటు యూపీ, బిహార్ నుంచి వెళ్ళిన వలస కార్మికులను హత్యలు చేసారని వెల్లడించింది.