బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధానిలో నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో ఈ ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పదవీ బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పగ్గాలు అమిత్ షా వరుసగా రెండోసారి చేపట్టారు. మొదటిసారి 2019లో ఆయన ఆ శాఖ మంత్రి అయ్యారు.
నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయం వద్ద ఆ శాఖ సహాయమంత్రులు నిత్యానంద రాయ్, బండి సంజయ్ కుమార్‌తో పాటు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అమిత్ షాకు స్వాగతం పలికారు.
అంతకుముందు అమిత్ షా ఢిల్లీ చాణక్యపురిలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు.
కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో హోం శాఖ బాధ్యతలు మరోసారి తనకే అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షా ధన్యవాదాలు వెల్లడించారు. అమిత్ షా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్‌లో ‘‘నాపై నమ్మకముంచి మరోసారి హోంశాఖ, సహకార శాఖల మంత్రిగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చారు.
‘‘మోడీ 3.0లో సురక్షిత భారతదేశం కోసం ప్రధాని ఆలోచనలను సాకారం చేసేందుకు కొత్త విధానాలను ప్రవేశపెడతాం. భద్రతా వ్యవహారాలను బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేస్తాం. ‘సహకారంతో సమృద్ధి’ అనే దార్శనికతను సాకారం చేసేందుకు రైతును, గ్రామాలను సాధికారం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది’’ అని అమిత్ షా వెల్లడించారు.
59 ఏళ్ళ అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి సుమారు ఏడున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రధాని మోదీకి అమిత్ షా అత్యంత సన్నిహితుడు, కీలక వ్యూహకర్త. రాజ్యాంగ అధికరణం 370 తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం వంటివి గత ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా సాధించిన ఘనతలు.