లండన్లో ఘోరం జరిగింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ప్రమాదవశాత్తు బ్లాక్ఫూల్ బీచ్లో మరణించాడు. ఉన్నత విద్యకోసం 2021లో లండన్ వెళ్లిన సాయిరాం..చదువు పూర్తి చేసుకుని మాంచెస్టర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఏడుకొండలు, అన్నపూర్ణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం, కిరణ్ సాయి, సాయిరాం. ఏడుకొండలు ఏడు సంవత్సరాల కిందట కాలం చేశాడు. తల్లి అన్నపూర్ణమ్మ షిర్డి యాత్రలో ఉన్నారు. లండన్ నుంచి బంధువులకు సమాచారం అందడంతో వారు మీడియాకు వెల్లడించారు. సాయిరాం మృతదేహాన్ని లండన్ విక్టోరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు బ్రిటన్ పోలీసులు సమాచారం పంపారు.
సాయిరాం మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని గ్రామస్థులు, బంధువులు కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. సాయిరాం తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందిన వారు. వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకున్నారు. ఎదిగి వచ్చే సమయంలో సాయిరాం మరణం గ్రామంలో విషాదం నింపింది.