రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని, మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వీడియోకు చిక్కిన జంతువుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో ఎంపీ దుర్గాదాస్ మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలో వెనక కనిపించిన జంతువు చిరుత అంటూ ప్రచారం చేశారు. దీనిపై అటవీ శాఖ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రపతి భవన్‌ను జల్లెడపట్టారు. వీడియోలను జూమ్ చేసి గమనించారు. దుర్గాదాస్ మంత్రిగా ప్రమాణం చేస్తోన్న సమయంలో వీడియోలో కనిపించిన జంతువు చిరుత కాదని, అది పిల్లని తేల్చిపడేవారు. దీంతో వైరల్ వార్తకు తెరపడింది.
ఆదివారంనాడు రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా మోదీ, 71 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేసే సమయంలో ప్రధాని, రాష్ట్రపతి వెనకాల భవన్‌లో ఓ పిల్లి నిదానంగా నడుచుకుంటూ వెళ్లింది. అది వీడియోల్లో అస్పష్టంగా కనిపించింది. కొందరు అది చిరుత అంటూ ప్రచారం చేశారు. అయితే రాష్ట్రపతి భవన్‌లోకి చిరుతలు ప్రవేశించే అవకాశం లేదు. అయినా పోలీసులు తనిఖీలు చేసి చిరుతకాదు, పిల్లి అని తేల్చారు.