రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఐదుగురికి నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిపదవులు లభించాయి. వాటిలో బిజెపి ఎంపీలు ముగ్గురు, తెలుగుదేశం ఎంపీలు ఇద్దరు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా కింజరాపు రాంమోహన్ నాయుడు గెలిచారు. ఆయనకు పౌరవిమానయాన శాఖ క్యాబినెట్ మంత్రి హోదా దక్కింది. గతంలో టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అదే శాఖ మంత్రిగా పనిచేసారు.
తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ బిజెపి ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డికి బొగ్గు, గనుల శాఖ క్యాబినెట్ మంత్రి పదవి లభించింది. మోదీ గత మంత్రివర్గంలోనూ కిషన్‌రెడ్డి సభ్యులే.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి తొలిసారి గెలిచిన తెలుగుదేశం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పదవి లభించింది.
తెలంగాణ కరీంనగర్ నుంచి విజయం సాధించిన బిజెపి ఎంపీ బండి సంజయ్‌కుమార్ హోంశాఖ సహాయమంత్రి పదవి పొందారు.
ఆంధ్రప్రదేశ్ నరసాపురం నుంచి బిజెపి ఎంపీగా తొలిసారి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రి పదవి లభించింది.
దక్షిణాదిలో బిజెపి మొదటిసారి కేరళలో ఎంపీ సీటు గెలుచుకుంది. త్రిశూర్ నియోజకవర్గంలో ప్రముఖ సినీనటుడు సురేష్‌గోపి గెలిచారు. ఆయనకు పెట్రోలియం, సహజ వాయువులు, పర్యాటక శాఖల సహాయ మంత్రి పదవి దక్కింది.