నరేంద్ర మోదీ మూడవసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గం ఆదివారం ప్రమాణం చేసింది. ప్రధానితో పాటు ప్రమాణస్వీకారం చేసిన 71మంది మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తు సోమవారం సాయంత్రానికి పూర్తయింది.
కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. హోంశాఖలో అమిత్ షాను, రక్షణశాఖలో రాజ్‌నాథ్ సింగ్‌ను, విదేశాంగ శాఖలో ఎస్ జయశంకర్‌ను, ఆర్థిక శాఖలో నిర్మలా సీతారామన్‌ను కొనసాగించారు.
నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిగా కొనసాగుతారు. ఆ శాఖలో అత్యధిక కాలం పనిచేసిన మంత్రి ఆయనే. సుమారు 55వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించిన ఘనత ఆయన సొంతం.
పీయూష్ గోయల్ వాణిజ్య శాఖను మరోసారి దక్కించుకున్నారు. జెపి నడ్డా 2014 క్యాబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా చేసారు, ఇప్పుడు కూడా ఆయనకు అదే శాఖ దక్కింది. అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖలో కొనసాగుతున్నారు.