నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ వెంటనే భారత్ పాల్గొనవలసిన అంతర్జాతీయ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవి ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల ప్రధానమైన కార్యక్రమాలు.
గత దశాబ్ద కాలంలో భారత్ బలమైన స్వరంగా నిలిచింది. ‘విశ్వబంధు’ విధానంతో ‘గ్లోబల్ సౌత్’కు గొంతుకగా భారత్‌ను నిలబెట్టడానికి నరేంద్రమోదీ ప్రాధాన్యత ఇచ్చారు. ‘వసుధైవ కుటుంబకం’ నినాదంతో భారత్ ఇటీవలే జి-20 సదస్సు నిర్వహించింది.
మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసాక రాబోయే కొద్ది నెలల్లో జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి….
(1) బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం:
జూన్ 10, 11 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం రష్యాలోని నిజ్నీ నోవ్గొరోడ్లో జరుగుతోంది. ఈ కూటమిలో పది దేశాలున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా వ్యవస్థాపక దేశాలు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా తర్వాత చేరిన దేశాలు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ కూటమిలో చేరింది.
(2) జి-7 సదస్సు:
ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఇటలీలో జరిగే జి-7 సదస్సుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారు. ఆ దేశపు ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, జి7 సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోదీని ఏప్రిల్‌లోనే ఆహ్వానించారు. జి7 అనేది ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికా దేశాల కూటమి. దానికి భారత్‌ను ఆహ్వానించడం అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం.
(3) స్విస్ శాంతి సదస్సు:
ఈ నెల 15, 16 తేదీల్లో స్విట్జర్లాండ్‌లో అంతర్జాతీయ శాంతి సదస్సు జరగనుంది. ఆ సదస్సు ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ పరిష్కారం గురించి చర్చిస్తుంది. ఆ సదస్సులో భారత్ పాల్గొనేదీ లేనిదీ ఇంకా వెల్లడించలేదు.
ఉక్రెయిన్ నవంబర్ 2022లో ఒక శాంతి ప్రణాళికను ప్రకటించింది. దానికి కావలసిన దౌత్య మద్దతును కూడగట్టడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. ఆ ప్రణాళిక ప్రకారం రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగం నుంచి పూర్తిగా వైదొలగాలి, రష్యా తన యుద్ధ నేరాలకు జవాబుదారీ తనాన్ని ప్రకటించాలి. ఉక్రెయిన్ శాంతి ప్రణాళికే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా జూన్ 2023 నుంచీ నాలుగు దిగువ స్థాయి సమావేశాలు జరిగాయి.
(4) అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భారత పర్యటన:
అగ్రరాజ్యం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ భారత్‌లో అధికారంగా పర్యటించనున్నారు. కొద్దిరోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మూడోసారి విజయం సాధించినందుకు అభినందించారు. ఆ సందర్భంలో సలివాన్ భారత పర్యటన గురించి కూడా చర్చ జరిగింది. అమెరికా-భారత్ ప్రాధమ్యాలను చర్చించడం, ఇరుదేశాల మధ్యా విశ్వసనీయమైన, వ్యూహాత్మకమైన సాంకేతిక భాగస్వామ్యం గురించి చర్చలు జరపడం సలివాన్ పర్యటన ప్రధాన లక్ష్యాలు.
(5) కజకిస్తాన్‌లో ఎస్‌సిఒ సదస్సు:
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఈ యేడాది కజకిస్తాన్ అధ్యక్షతన ఆ దేశంలో జరగనుంది. దానికి సన్నాహకంగా నిర్వహించిన విదేశాంగ, రక్షణ శాఖల సమావేశాల్లో భారత్ నుంచి ఆయా శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఉగ్రవాదం, జాతుల ఘర్షణలు, వేర్పాటువాదం, మత ఉగ్రవాదం, ప్రాదేశిక అభివృద్ధి ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు. గతేడాది ఈ సదస్సుకు భారత్ అధ్యక్షత వహించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు