ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఈ ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా ఆయన తన మొదటి ఫైల్‌పై సంతకం చేసారు. మోదీ తన మొదటి ప్రాధాన్యం రైతులకే అని స్పష్టం చేస్తూ సంబంధిత దస్త్రం మీద సంతకం పెట్టారు. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసే ఫైల్‌ను క్లియర్ చేసారు. ఆ పథకం ద్వారా 9కోట్ల 30లక్షల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తారు.
‘‘మా ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రధానమంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించాక నా మొదటి సంతకం రైతుల సంక్షేమానికి సంబంధించిన ఫైలు మీదనే చేసాను. భవిష్యత్తులో మా ప్రభుత్వం రైతుల సంక్షేమం మీద, వ్యవసాయ రంగం మీద ప్రధానంగా దృష్టి సారిస్తుంది’’ అని నరేంద్ర మోదీ వెల్లడించారు.
నరేంద్ర మోదీ తన మూడవ ప్రభుత్వపు మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. వీలైనంత త్వరలో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్యాబినెట్ అభ్యర్ధించనుంది. మరోవైపు, నిన్న ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు ఇవాళ సాయంత్రం జరుగుతుందని తెలుస్తోంది.