జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో, లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులు బస్సులో వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా ఉగ్రవాదులు ఈ దారుణానికి దిగారు.
తెర్యాత్ గ్రామ సమీపంలో బస్సులో ప్రయాణిస్తోన్న వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవర్‌కు బులెట్లు తగలడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. బస్సులోయలో పడిపోయింది. శివభోరి నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళుతుండగా ఈ కాల్పుల ఘటన జరిగిందని జిల్లా ఎస్పీ మోహితా శర్మ మీడియాకు తెలిపారు. ఉగ్రవాదులు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోయలోపడ్డ బస్సు నుంచి 9 మృతదేహాలను వెలికితీశారు. ఉగ్రవాదుల కోసం బలగాలు వేట సాగిస్తున్నాయి.