దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, నరేంద్ర మోదీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేశంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో పీఎంగా మోదీ చరిత్ర సృష్టించారు.
ప్రధాని సహా మొత్తం70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ సహా 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు…తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు వరించాయి. ఏపీ టీడీపీ ఎంపీ రాంమోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరికి ఏ శాఖలు కేటాయించాల్సి ఉంది.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలు సహా 8 వేల మందికిపైగా ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో కాశీవిశ్వనాథుడ్ని దర్శించుకోనున్నారు.